ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. కౌంటర్ కేసులు పెట్టి అందర్నీ జైలుకు పంపారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఊళ్ళో పోలీసు పికెట్ నడుస్తుంది. గ్రామ పంచాయితీ ఆఫీసులో షెల్టర్ తీసుకున్నారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఇంచార్జ్ జందార్ ఉన్నారు. ఒక పోలీసు నిరంతరం తుపాకీ పట్టుకొని పహారాలో ఉంటాడు. మిగతా వారు తమ తుపాకులను పంచాయితీ ఆఫీసు లోపలి గదిలో పెట్టి బయట యాప చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఆఫీస్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో భోజనాలు వండుతున్నారు. వంట వచ్చిన పోలీసు ఆ పనిలో ఉన్నాడు. గ్రామ మస్కురి చికెన్ కడుగుతున్నాడు.
పోలీసుకు భోజనానికి కొదువ ఉండదు. కాకపోతే సమయానికి దొరకదు. ఇంతలో ఒక గ్రామస్తుడు వచ్చి జందార్‌ను పరిచయం చేసుకున్నాడు. ‘‘సర్... ఈరోజు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి సార్’’ అన్నాడు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఉత్సాహం ప్రదర్శించి ‘‘దాందేముంది.. వస్తాం సార్’’ అన్నాడు. జందార్ కానిస్టేబుల్ వైపు గుర్రుగా చూసి ‘‘ఇంకోసారి వస్తాంలే బ్రదర్ ఈరోజుకు వంట అయిపోయింది’’ అని అతనితో అన్నాడు. దాంతో అతను వెళ్ళిపోయాడు. ‘‘ప్రజల్లో పోలీసుకు సహజ అనుకూలురు సహజ వ్యతిరేకులు ఉంటారు. అందుకు ఎవరి కారణాలు వారికుంటాయి. పోలీసుకు భోజనం ఎంత దూరమో అంత ప్రమాదం కూడా’’ అని కొత్త కానిస్టేబుల్‌తో అన్నాడు. కొత్త కానిస్టేబుల్ అయోమయంగా చూసి ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘నీకు అనుభవం లేదు కాబట్టి, ఒక జరిగిన సంఘటన చెబుతా విను’’ అన్నాడు.
1
తుపాకుల నర్సయ్య తన చుట్టూ గుమికూడిన పోరగాండ్లని దూరంగా పొమ్మని గద్దించి, తన భుజానికి గట్టిగా బిగబట్టి ఢామ్మని తుపాకీ పేల్చాడు. తుపాకీ చప్పుడు విన్న వారి గుండెలు కొట్టుకున్నాయి. పిట్టలు దిగ్భ్రాంతి చెంది తుపాకీలోని ఛర్రాల లాగా చెల్లాచెదురయ్యాయి. రాయి చెట్టు మీద ఉన్న పచ్చ గువ్వలు, తపసు పక్షులు, గుడ్లగూబలు చెల్లా చెదురుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. బర్మార్ తుపాకీలో నుండి దూసుకొచ్చిన చర్రాలు పచ్చ గువ్వల వంట్లోకి దూసుకుపోయాయి. ఒక రెండు గువ్వలు చెట్టు మీది నుండి కింద పడ్డాయి. ఇంకో రెండు ఓ వంద గజాలు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి పొలంలో రాలిపోయాయి. తుపాకీని భుజానికి తగిలించుకొని, చెట్టు కింద పడ్డ గువ్వలను చేతిలోకి తీసుకున్నాడు నర్సయ్య. రక్తం ఓడుతున్న రెండిట్లో ఒకటి ఇంకా కదులుతూనే ఉంది. వాటిని తన భుజానికి ఉన్న గుడ్డ సంచిలో వేశాడు. నర్సయ్య వెంట వచ్చిన వెంకన్న పొలంలో పడ్డ రెండు పచ్చ గువ్వలను తెచ్చాడు. వాటిని కూడా సంచిలో వేసుకున్నాడు నర్సయ్య.
నర్సయ్య ఆరడుగుల ఎత్తు ఉంటాడు. మోకాళ్ళ వరకు ఖాకీ రంగు నిక్కరు, నిండు చేతుల చొక్కా, కాస్త పెద్దగా ఉండే మీసాలు, కుడి భుజం మీద నుండి ఎడమ వైపుకు వేలాడే మందుగుండు సామగ్రి ఉండే సంచి, పిక్కల కంటే కొంచెం కిందుగా ఉండే నల్లని బూట్లు. చూడ్డానికి బలిష్టమైన జవాను లాగా ఉంటాడు. కాకపోతే ఒక్క ఎర్ర టోపీ మాత్రం ఉండదు. కానీ, ఎర్ర తువాలు నెత్తికి చుట్టుకునేవాడు. నర్సయ్య పోలీసు కంటే కూడా సీరియస్‌గా ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. వారానికోసారి వేటకు బయలుదేరేవాడు. వెంట ముగ్గుర్నో నలుగుర్నో సహాయంగా తెచ్చుకునేవాడు. సహాయకులు మాట్లాడుకునేవారు తప్ప నర్సయ్య మాత్రం మాట్లాడేవాడు కాదు. నర్సయ్య సైన్యాధ్యక్షుడిలా ముందు నడుస్తుంటే సైన్యం వెనకాల పరిగెత్తేది.
ఊరి చుట్టుపక్కల చెట్ల మీది పచ్చ గువ్వలు, చమర కాకులు, కముజు పిట్టలను కొట్టేవాడు. నర్సయ్య మోకాళ్ళమీద కూసోని బర్మార్ తుపాకిని మోకాళ్ళ మధ్యన పెట్టుకొని, సంచిలో డబ్బాలో ఉన్న పచ్చటి పొడిని చెంచాలాగా చేసిన తాటాకు ముక్కతో తీసి తుపాకీ గొట్టంలో పోసేవాడు. దానిమీద సైకిల్ చర్రాల వంటి ఇనుప గుండ్లు పోసేవాడు. దానిమీద పిడకల పొడిని వేసేవాడు. తుపాకీకి తగిలించి ఉన్న పొడుగాటి ఇనుప సువ్వ తీసుకొని ఆ గొట్టంలో పెట్టి కూర్చేవాడు. ట్రిగ్గర్ తగిలే దగ్గర గొట్టంలో పచ్చటి పొడిని పోసి నెమ్మదిగా ట్రిగ్గర్ బిగించేవాడు. ఆ ట్రిగ్గర్‌ను పైకి లాగి వదిలితే తుపాకీ పేలుతుంది. పిట్టల కూర మీద మొహం మొత్తినప్పుడు కుందేళ్ళ వేటకు వెళ్ళేవాడు. అప్పుడు తుపాకీని కుడి చేత్తో పట్టుకుని రంగనాయకుల గుట్ట వైపు వేటకు పోయేవాడు. ఆయన వెంట ఆ ముగ్గురో నలుగురో సైనికుల్లా అనుసరించేవారు. అప్పుడు వాళ్ళలో ఒకరి చేతిలో పెద్ద బ్యాటరీ లైటు ఉండేది. ఆ లైటు ఫోకస్ కుందేళ్ళ మొకం మీద పడితే అవి కదలలేవట మరి.
ఊర్లో ఇంకో ముగ్గురికి తుపాకులు ఉన్నాయి. కానీ, ఆ రాజసం మాత్రం ఎవరికీ లేదు. ఒకాయన పంచ కట్టుకొని, ఇంకొకాయన పాయింటు వేసుకొని, ఇంకొకాయన నిక్కరు వేసుకొని వేట చేసేవారు. కానీ, వారి తుపాకులకు ఎలాంటి రాజసమూ లేదు. వారి మీదున్న తుపాకులను చూస్తే పచ్చ గువ్వలు కాదు కదా ఊర పిచుకలు కూడా బెదరవు. వారు పట్టుకున్నందువల్ల మాత్రమే ఆ తుపాకులకు కళ పోయింది. తుపాకులు ఎప్పుడూ పిరికివి కావు. వాళ్ళు తుపాకులు పేల్చినా జనాలు పట్టించుకునేవారు కాదు. అదే నర్సయ్య పేల్చకపోయినా యుద్ధ సన్నద్ధం గోచరించేది. సరిహద్దు సైనికులకుండే నిబద్ధత ఏదో నర్సయ్యలో ఉంది. కేవలం వేట కోసమే తాను పుట్టినట్టు కనపడేవాడు. తనను ఎప్పుడు పేల్చుతాడా అని నర్సయ్య తుపాకీ ఎదురు చూసేది. రాత్రంతా వేటాడి కుందేళ్లు, రకరకాల పిట్టలను సంచిలో మోసుకుంటూ తెచ్చేవారు. రాత్రంతా నిద్ర లేక వారి మొహం అలసిపోయి ఉండేది. నర్సయ్య మొహంలో సంతృప్తో, అసంతృప్తో తెలియని గంభీరత ఉండేది.
2
నర్సయ్యకు ఇద్దరు భార్యలు. ఇంటి ముందు గదిలో చిన్నపాటి కిరాణా కొట్టు నడిపేవాడు. ఆ కొట్లో కొన్నిసార్లు చిన్న భార్య, కొన్నిసార్లు పెద్దామె కూర్చునేవారు. చాలా అరుదుగా నర్సయ్య కూడా కొట్లో కూర్చునేవాడు. కొట్లో, ఇంట్లోనూ కూడా పోలీసు నిక్కరు మీదనే ఉండేవాడు. కొట్లో కొనుక్కోడానికి వచ్చే వాళ్లతో కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న తుపాకీ మాదిరిగా గుంభనంగా ఉండేవాడు. పెద్ద మనుషులు ఎవరన్నా పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడేవాడు.
నర్సయ్య బయటి ఆడోళ్లవైపు చూసేవాడు కాదు. మొదటి పెండ్లికి ముందు చలాకీగా, రెండో పెండ్లికి ముందు కాస్త తక్కువ చలాకీగా ఉండేవాడని ఆయన వెంట ఉండే సైనికులు చెప్పేవారు. మరి ఇద్దరు భార్యలను ఎందువల్ల చేసుకోవలసి వచ్చిందో సరైన కారణం తెలియదు. మొదటి పెండ్లి తరువాత తగ్గిన చలాకీతనాన్ని ఆయన అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా వేటకు వెళ్లొచ్చిన రోజు తప్పకుండా గొడవ అయ్యేది. మొదటి గొడవ కూర వండను అన్నప్పుడు, రెండోది కూర బాలేకుంటే. అయితే ఆ గొడవ ఒక్కోసారి హఠాత్తుగా ముగిసిపోయేది. నర్సయ్య కాస్త ఎక్కువ తాగిన రోజున తుపాకీ లోడు చేసి భార్యల వైపు గురిపెట్టే వాడని, దాంతో గొడవ హఠాత్తుగా ముగిసిపోయేదని చెప్పుకునేవారు.
3
నర్సయ్య ఇంటి పక్కనే బడి ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఆ రోజు మధ్యాహ్నానికే అధికారులు వచ్చి బళ్ళో విడిది చేశారు. ఆ ఊరుకు గతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి నలుగురు పోలీసులను బందోబస్తుకు పంపారు. నలుగురి వద్ద నాలుగు 303 తుపాకులు ఉన్నాయి. వారి బసకు బళ్లో ఒక గదిని కేటాయించారు. తెల్లారితే ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల అధికారి ఆ ఊరి మస్కురి సహాయంతో భోజన ఏర్పాట్లలో ఉన్నాడు. ఎన్నికల హడావిడి అంతా మాదే అన్నట్టు ఫీల్ అవుతారు ఎన్నికల అధికారులు. కానీ, అది నిజం కాదు. అసలైన హడావిడి అంతా పోలీసుల చుట్టే ఉంటుంది. పోలీసులకు చాలా ముందుచూపు ఉంటుంది. ఆ రాత్రికి పుష్టికరమైన భోజనం ఏర్పాటు చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు లోకల్ పోలీసులు కాదు కాబట్టి ఆ ఊళ్ళో ఎవరూ పరిచయం లేదు.
ఒక పోలీసు డ్రెస్ మార్చుకొని నింపాదిగా పక్కనే ఉన్న నర్సయ్య కిరాణం కొట్టుకు వెళ్ళాడు. సిగరెట్ కొనుక్కున్నాడు. నర్సయ్య చిన భార్య ఇచ్చిన అగ్గిపెట్టెతో సిగరెట్ ముట్టించాడు. కొట్టు ముందు అరుగు మీద కూసున్న కుర్రోళ్ల పక్కన కూసోని సిగరెట్ తాగాడు. రెండు సిగరెట్లు అయిపోయే లోపల నర్సయ్య చరిత్ర మొత్తం సేకరించాడు. నర్సయ్య పోలీసుల కంటే మేలైన విలుకాడు అని కూడా గుర్తించాడు.
4
ఇంచార్జ్ పోలీసుకు ఉండాల్సింది సమాచారాన్ని వాస్తవ రూపం దాల్చేలా చేయడమే. మస్కురిని పంపి తుపాకుల నర్సయ్యని పిలిపించాడు. ‘‘నీ తుపాకీని స్టేషన్లో డిపాజిట్ చేయాలి కదా! ఎందుకు చేయలేదు?’’ అని గంభీరంగా అడిగాడు నర్సయ్యని. ‘‘నాకు తెలియదు సార్.. నాకు ఎవరూ చెప్పలేదు’’ అన్నాడు నర్సయ్య వినయంగా. ‘‘ఒక గంట లోపల అన్ని తుపాకులూ ఇక్కడికి తెప్పించాలి’’ అని మస్కురికి చెప్పాడు ఇంచార్జ్ పోలీసు. పోలీసు ఆదేశాలపట్ల గౌరవంతో తన తుపాకీ తేవడానికి నర్సయ్య వెళ్ళిపోయాడు. ‘‘మాజీ సర్పంచ్ వెళ్లి ఎస్సైతో మాట్లాడాడంట సార్. అందుకే వీళ్ళు తుపాకులు ఇవ్వలేదు’’ అన్నాడు మస్కురి.‘‘నాగ్గూడా తెలుసులేరా.. మరి పోలీసన్నాకా కొంచెం అన్నా అధారిటీ చూయించకపోతే జనాలకు భయం ఉండదు. రేపు ఓట్లు అయిపోయే వరకూ నేనే కదా ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సింది? అందుకే అందర్నీ పిలువు. నా తడాఖా ఏందో నువ్వు చూద్దువుగానీ’’ అని మీసం మెలేశాడు. దర్పం ప్రదర్శించడంలోనే పోలీసు విలువ ఉందన్న సత్యం మస్కురికి తెలుసు.
ఇంతలో ఇంకో పోలీసు వచ్చాడు. ఆయన లోకల్ పోలీసు. నాన్ లోకల్ పోలీసులకు గైడుగా వచ్చాడు. తుపాకులోళ్ళని పిలిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. ‘‘వాళ్ళని పిలిపిస్తే గొడవ అయిద్ది సార్. ఈ వూరు అసలే మంచిది కాదు. తుపాకులోళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి సార్’’ అన్నాడు లోకల్ పోలీసు. ఇంచార్జ్ ఏమీ అనలేదు. ‘‘నర్సయ్య దగ్గర ఏమన్నా కుందేళ్లు ఉన్నాయా?’’ అని మస్కురిని అడిగాడు లోకల్ పోలీసు. ‘‘రాత్రి యాటకు బొయ్యి పొద్దున్నే వచ్చిండు. ఉండొచ్చు సార్’’ అన్నాడు. ఇంతలో నర్సయ్య తుపాకీ తీసుకొని వచ్చాడు.‘‘ఏంది నర్సయ్యా.. ఎలక్షన్ల టైములోతుపాకీ తీసుకొని తిరుగుతున్నావు?’’ అని అడిగాడు లోకల్ పోలీస్.
‘‘బావుండ్రా సార్... మీరెప్పుడొచ్చారు?’’ అని నవ్వుతూ ‘‘మీవోళ్ళే తెమ్మన్నారు సార్’’ అన్నాడు. ‘‘ఏ..హే.. వాళ్లకు నీ గురించి తెల్వదులే.. ఏమి సంగతులు? రాత్తెర యాట బాగ జరిగిందంట గదా?’’ అన్నాడు. ‘ఏం లేదు సార్.. రెండు కుందేళ్లు, ఓ పది గల కముజు పిట్టలు పడ్డయి సార్! అన్నీ అమ్మిన. ఒక్క కుందేలు మాత్రం ఉంది సార్’’ అన్నాడు. ‘‘మరి ఇయ్యాల మాకు కుందేలు కూర తినిపియ్యరాదు. జందార్ సాబ్‌కు ఇష్టమట’’ అన్నాడు నవ్వుతూ.
‘‘సరే సార్.. దాందేముంది’’ అనుకుంటూ తుపాకీ తీసుకొని వెళ్ళిపోయాడు నర్సయ్య.
5
గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఊళ్ళో పార్టీల నాయకులు పోల్ మేనేజ్‌మెంట్ పనిలో బిజీగా ఉన్నారు. అసలైన ప్రజాస్వామ్యానికి పునాది పడేది ఆరాత్రే. రాత్రి ఎనిమిదింటి సమయంలో బళ్ళో ఉన్న పోలీసులు రెండు పెగ్గులేసి, కుందేలు కూర సగం తిన్నారో లేదో.. నర్సయ్య ఇంట్లో హఠాత్తుగా గొడవ మొదలయింది. ఎన్నడూ లేనంత తారస్థాయిలో మాటలు పేలుతున్నాయి. నర్సయ్య ఇంట్లో గొడవతో జనాలు ఒక్కొక్కరుగా ఇండ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు. బడికి ప్రహరీ గోడ లేదు. పోలీసులు గ్లాసులు పక్కకునెట్టి బయటకు వచ్చి నిలబడ్డారు. తుపాకీ తీసుకొని వెంటబడడంతో నర్సయ్య ఇద్దరు భార్యలూ ‘‘వామ్మోవ్.. ముండాకొడుకు కాల్చి సంపెట్టుండే’’ అని మొత్తుకుంటూ ఉరికొచ్చి పోలీసుల వెనకాల నిలబడ్డారు. పోలీసులు గద్దాయించినా కూడా నర్సయ్య గన్ను దింపకపోగా.. ‘‘దొంగ ముండల్లారా.. ఇయ్యాల మీరో నేనో తేలిపోవాలి’’ అని నేరుగా జందార్ సాబుకే తుపాకీ గురిపెట్టాడు.
జందార్ సాబ్‌కు ఉచ్చ బడ్డది. ‘‘ఒరేయ్... వాని తుపాకీ గుంజుకోరా’’ అని మస్కురికి పురమాయించాడు. ఇంతలో జనం జమయ్యారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న కార్యకర్తలూ నాయకులూ ఆ గలాటా దగ్గరికి వచ్చారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సుల గదికి తాళం వేసి ఆన్నే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆందోళనల్లోనుండే ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంటదనే సోయి ఎన్నికల అధికారికి ఉంది. మిగతా సిబ్బంది కర్రలు పట్టుకుని ఆయన చుట్టూ నిలబడ్డారు. పోల్ మేనేజ్‌మెంట్‌లోని ఒక వర్గం కార్యకర్తలు నర్సయ్య భార్యల వెనకవైపు వచ్చి ‘‘ఏమైందీ?’’ అని ఆరా తీస్తున్నారు. ఇంకో వర్గం నర్సయ్య వెనకాలకు చేరి ‘‘ఏమైందీ?’’ అని అడిగారు. ‘‘ఈ పోలీసు సారు కుందేలు కూర అడిగితే వండమన్నా.. అదేమో వండనన్నది. ఇదేమో వండింది గని.. వండినంక.. ‘వాడెవనికి బుట్టిండు, వీడెవనికి బుట్టిండు! అన్నది. ఆఖరికి నువ్వెవనికి బుట్టినవు అని కూడా అన్నది. ఎప్పన్నుంచో ఓపికబడుతున్న.
ఇయ్యాల ఈ ముండల సంగతి తేలాలి’’ అని భుజానికి తుపాకీని అదిమి పెట్టి పట్టుకున్నాడు. రోజుటికంటే ఇయ్యాల ఒక పెగ్గు ఎక్కువే తాగినట్టుండు నర్సయ్య. పైగా ఇద్దరు పెండ్లాలు ఏకమైనా కూడా కుందేలు కూర తిన్న పోలీసులు తనకే సపోర్ట్ చేస్తారనే ధైర్యం కూడా తోడయినట్టుంది. కొందరు తుపాకీని గుంజుకోవాలని చూసినా నర్సయ్య ఉడుం పట్టు వదలడం లేదు. భార్యల వైపు ఉన్న ఒక కార్యకర్త ‘‘ఇదంతా ఈ పోలీసుల వల్లనే వచ్చింది. కుందేలు కూర దొబ్బితిని మొగుడూ పెండ్లాలకు గొడవ పెట్టిండ్రు’’ అన్నాడు. ‘‘ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మాటలు జాగర్తగా రానియ్యి’’ అని వాని మీదికి పొయ్యాడు జందార్ సాబ్. అంత మంది ముందు పోలీసు తన కార్యకర్త మీదికి పోయేసరికి వాళ్ళ నాయకుడు కోపానికి రావాల్సొచ్చింది. ‘‘ఏదీ.. మావోనిమీద చెయ్ వెయ్ చూస్తా’’ అని పోలీసు ఇంచార్జ్ మీదికి పోయాడు.
ప్రత్యర్థి వర్గ నాయకునికి కూడా పౌరుషం వచ్చింది. ఇలాంటి సమయంలో దూసుకొని పోకపోతే రేపు తనకు ఓట్లు పడవు అనే డౌట్ వచ్చిన సర్పంచ్ అభ్యర్థి ‘‘ఏందిరా.. పోలీసు మీదనే చెయ్ వేస్తావా!’’ అని అతని మీదికి పోయాడు. ‘‘నువ్వెవర్రా?.. ఈ పోలీసులు నీవోల్లా?.. రిగ్గింగ్ చేయనీకి తెచ్చుకున్నవా?’’ అని అతని గల్లా పట్టనే పట్టిండు ఒక కార్యకర్త. సహనం కోల్పోయిన నర్సయ్య ఢాం అని తుపాకీ పేల్చాడు. పోలీసు ఇంచార్జ్ పక్కనుండి, ఇద్దరు భార్యల మీదకి గుండ్లు వెళ్ళేవే.. కానీ, ఎవరో తన చెయ్యి పట్టి లాగడం వల్ల అది పైకి గాల్లోకి పేలింది. ఇదే సందని రెండు వర్గాలూ గలాటాకు దిగాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ రోడ్డు మీద నుండి బళ్లోకి వచ్చారు. పోలీసులకు తమ కర్తవ్యం గుర్తొచ్చి, డ్రెస్ వేసుకునే సమయం లేక, లుంగీలు కాశబోసి, లోపలికి ఉరికి తమ తుపాకులు తెచ్చి లోడు చేసి బ్యాలెట్ బాక్సుల ముందు వరుసగా నిలబడ్డారు.
‘‘నన్ను రిగ్గింగ్ చేసేటోడంటావురా’’ అని కర్రలతో కొట్టుకుంటూ, రాళ్లు విసురుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు ఒక వర్గం కార్యకర్త గభాల్న ఉరికి బ్యాలెట్ గది తలుపుని తన్ననే తన్నాడు. బ్యాలెట్‌కు ఏదన్నా అయితే కనీసం ప్రతిఘటన అయినా ఇవ్వలేదని అధికారులు అడుగుతారని పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నర్సయ్య తన ఇంట్లోకి వెళ్ళి మరోసారి గన్ను లోడు చేయడం మొదలు పెట్టాడు. మస్కురి ఉరికి నర్సయ్య బయటకు రాకుండా గొళ్ళెం పెట్టాడు. నర్సయ్య భార్యలు పక్కింట్లో తల దాచుకున్నారు. బీపీ పెరిగి పడిపోయిన ఎన్నికల అధికారికి ఊళ్ళో పేరుమోసిన ఆర్‌ఎంపీ డాక్టర్ సపర్యలు చేస్తున్నాడు. ఇంతలో అదనపు బలగాలు వచ్చాయి. వీపుకు తుపాకులు, చేతిలో లాఠీలతో డీసీఎం వాన్ నుండి దూకిన స్పెషల్ పోలీసులు అందినకాడికి వీపులు, అందకపోతే పిర్రలు పగలగొట్టారు. అటు సగం మందిని ఇటు సగం మందిని గెదిమి రోడ్డుమీద నిలబడ్డారు పోలీసులు.
కొందరు కార్యకర్తలు ఎంతో హుషారుగా ఉంటారు. వాళ్ళు నాయకుల కోసం ఎంతకైనా తెగిస్తారు. పోలీసులు లాఠీఛార్జ్ పనిలో ఉండగా, వారు తెరిచి ఉన్న గదుల్లో జొరబడ్డారు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారోగానీ ముందుగా కనపడ్డ మందు బాటిళ్ళూ, కుందేలు కూర ఎత్తుకుపోయారు. కొత్త కానిస్టేబుల్ తల విదిలించి ఉడుకుతున్న చికెన్ వాసనను గాఢంగా పీల్చుకున్నాడు. తుపాకులు ఉన్నా ఒక్కోసారి మన కూర మనకు దక్కదు అని అనుకున్నాడు. ‘‘వంట అయింది భోజనానికి రండి సార్’’ అని వంట కానిస్టేబుల్ పిలిచాడు. దూరం నుంచి తీవ్రంగా చర్చించుకుంటూ పంచాయితీ ఆఫీసు వైపు వస్తున్న జనాల గుంపును చూసి తుపాకులు తెచ్చుకొని బయట నిలబడ్డారు పోలీసులు.
- గోపిరెడ్డి యేదుల


