పర్వతాలు, నదులను దాటుతూ ఏకధాటిగా ఎగురుతూ వెళ్లిన మూడు డేగలు
న్యూఢిల్లీ: నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత పరుగుపందెంలో 100 మీటర్లు వేగంగా పరిగెడితే శెభాష్ అంటాం. మరి ప్రకృతి ఒడిలో సహజంగా అబ్బిన నైపుణ్యంతో మూడు గద్దలు ఏకంగా 5,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగిరి వెళ్తే ఏమనాలి? కేవలం 150 గ్రాముల బరువైన ఈ చిన్న డేగల అసమాన ప్రయాణ కథ విని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు.
భారత వన్యప్రాణి సంస్థ(డబ్ల్యూఐఐ) డేగల వలస వైరుధ్యాలను లెక్కగట్టేందుకు నవంబర్ 11న అపపాంగ్, అలాంగ్, అహూ అనే మూడు డేగలకు శాటిలైట్ ట్రాకర్‌లను అతికించి పరీక్షించింది. అవి మణిపూర్ అరణ్యాల్లో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. ఎక్కడా ఆగకుండా అలసిపోకుండా సుదూరాలకు పయనించాయి. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక దాటుకుంటూ అరేబియా సముద్ర గగనతలాన్ని అలవోకగా దాటుకుంటూ తూర్పు ఆఫ్రికా దేశమైన సోమాలియాకు చేరుకున్నాయి. 5,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదురోజుల్లో దాటేయడం విశేషం.


