breaking news
falcon birds
-
మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!
మేనకోడలు అంటే ఏ మేనమామకు ఇష్టం ఉండదు. అందుకేనేమో అడిగి అడగంగానే కొనిస్తాడు కాబట్టే కవులు మామయ్యను చందమామతో పోల్చి మరి చెబుతుంటారు. అలానే ఇక్కడొక మామయ్య తన ముద్దులు మేనకోడలు చిరుకోరికను నెరవేర్చేందుకు ఎంత రిస్క్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు ఖర్చు పెట్టి మరి ఏం కొనిచ్చాడో తెలిస్తే విస్తుపోతారు. ఈ వింత ఘటన అబుదాబిలో చోటు చేసుకుంది. షేక్ అల్ మన్సూరి అనే చిన్నారి తన మేనమామతో కలిసి అబుదాబి ఇంటర్నేషనల్ హంటింగగ్ అండ్ ఈక్వెస్ట్రియన్ ఎగ్జిబిషన్ (ADIHEX) 2026కు హాజరైంది. ఆ కార్యక్రమంలో డేగల ఔత్సాహికులు, పెంపెకందారుల కోసం అత్యంత ఖరీదైన వేలం నిర్వహిస్తుంది. అయితే ఈ వేలంలో అత్యంత రికార్డు స్థాయిలో ఓ అరుదైన డేగను కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. నిజానికి బూడిదరంగు, నలుపు వంటి డేగలను చూస్తాం గానీ తెలుపు రంగు డేగలు అత్యంత అరుదు. అలాంటి అత్యంత అరుదైన తెల్లటి ఫాల్కన్ జాతి డేగ వేలంలో ఏకంగా రూ. 3.85 కోట్లకు అమ్ముడైపోయింది. దీన్ని తన మేనకోడలు కోసం వెచ్చించాడట. ఆమెకు డేగలంటే అమితమైన ఇష్టమని, అందులోనూ ఈ తెలుపు రంగు డేగ అంటేచాలా ఇష్టమని అందుకే ఇంత డబ్బు వెచ్చించినట్లు తెలిపాడు. ఈ అరుదైన డేగ అమెరికాలోని మార్క్ మెగ్లిచ్ ఫాల్కన్ ఫార్మ్‌కు చెందినది. దాని ఆకర్షణీయమైన స్వచ్ఛమైన తెల్లని ఈకలు, విలక్షణమైన శారీరక లక్షణాలు కారణంగా ఇది ఎల్లప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే డేగగా చెప్పొచ్చు. ఇది సుమారు కిలోగ్రాము బరువు, పొడవు, వెడల్పుల్లో దాదాపు 16.5 అంగుళాల కొలతతో ఉంటుంది. ఇక ఆ చిన్నారి మన్సూరిని ఈ డేగలపై ఆసక్తి ఎలా పెరిగిందని అడిగితే..అందుకు తన మామయ్యే కారణమని చెబుతుండటం విశేషం. View this post on Instagram A post shared by علي الجابري🇦🇪 (@ali.aljabri2) (చదవండి: మెహిందీ పెడుతూ.. లక్షదాక సంపాదిస్తున్న టెకీ!) -
బరువు 150 గ్రాములు దూరం 5,000 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత పరుగుపందెంలో 100 మీటర్లు వేగంగా పరిగెడితే శెభాష్ అంటాం. మరి ప్రకృతి ఒడిలో సహజంగా అబ్బిన నైపుణ్యంతో మూడు గద్దలు ఏకంగా 5,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగిరి వెళ్తే ఏమనాలి? కేవలం 150 గ్రాముల బరువైన ఈ చిన్న డేగల అసమాన ప్రయాణ కథ విని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. భారత వన్యప్రాణి సంస్థ(డబ్ల్యూఐఐ) డేగల వలస వైరుధ్యాలను లెక్కగట్టేందుకు నవంబర్ 11న అపపాంగ్, అలాంగ్, అహూ అనే మూడు డేగలకు శాటిలైట్ ట్రాకర్లను అతికించి పరీక్షించింది. అవి మణిపూర్ అరణ్యాల్లో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. ఎక్కడా ఆగకుండా అలసిపోకుండా సుదూరాలకు పయనించాయి. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక దాటుకుంటూ అరేబియా సముద్ర గగనతలాన్ని అలవోకగా దాటుకుంటూ తూర్పు ఆఫ్రికా దేశమైన సోమాలియాకు చేరుకున్నాయి. 5,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదురోజుల్లో దాటేయడం విశేషం. -
ఈ గద్దకు చూపెక్కువ!
లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు. -
ఫాల్కన్ పక్షుల కోసం.. విమానమే బుక్ చేశాడు!
రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. యువరాజు తలుచుకుంటే విమాన టికెట్లకు కొదవా అనుకోవాలి. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువరాజు తాజాగా తన వద్ద ఉన్న 80 ఫాల్కన్ పక్షుల కోసం ఏకంగా ఓ విమానంలో 80కి పైగా టికెట్లు కొనేశాడు. దీనికి సంబంధించిన ఫొటో రెడిట్ అనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లకు గంతలు కట్టిన ఫాల్కన్ పక్షులు విమానంలో ప్రయాణికుల సీటులోనే కూర్చుని దర్జాగా ప్రయాణం చేశాయి. ప్రతి పక్షిని కూడా ప్రయాణంలో పడిపోకుండా జాగ్రత్తగా సీట్లకు కట్టారు. రెడిట్‌లో ఉన్న లెన్సూ అనే యూజర్ ఈ ఫొటోను పోస్ట్ చేశారు. తన కెప్టెన్ స్నేహితుడు పంపినట్లు అందులో చెప్పారు. మొత్తం 80 పక్షులకు కూడా టికెట్లను సదరు యువరాజు కొన్నట్లు సౌదీ మీడియా పేర్కొంది. యూఏఈ జాతీయ పక్షి అయిన ఫాల్కన్లను ఒకచోటు నుంచి మరో చోటుకు ఇలా తరలించడం మధ్యప్రాచ్యంలో కొత్తేమీ కాదు. యూఏఈలో వాటికి సొంతగా ఫారెస్ట్ గ్రీన్ పాస్‌పోర్టులు కూడా ఇస్తారు. వాటి సాయంతో అవి బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ సౌదీ అరేబియా, పాకిస్థాన్, మొరాకో, సిరియా లాంటి దేశాలకలు వెళ్లచ్చు. తమ విమానాల్లోని ఎకానమీ క్లాసులో గరిష్ఠంగా ఒకసారి ఆరు ఫాల్కన్ పక్షులను తీసుకెళ్లొచ్చని ఖతార్ ఎయిర్వేస్ సంస్థ చెబుతోంది.


