జేఈఈ లేకుండానే.. ఐఐటీలో సీటు! | : 5 Students Secure IIT Kanpur Admission Without JEE via Olympiad Excellence | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిష‌న్‌!

Sep 10 2025 4:23 PM | Updated on Sep 10 2025 4:26 PM

Five students got admission in IIT Kanpur without JEE Advanced

ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)లో ప్ర‌వేశం కోసం దేశ‌వ్యాప్తంగా ఏటా ల‌క్ష‌లాది మంది విద్యార్థులు పోటీ ప‌డుతుంటారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)లో ఉత్తమ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ఐఐటీలో సీటు సంపాదించాల‌ని విద్యార్థులు కోరుకుంటారు. ఇంజనీరింగ్ చేయాలనుకునే దాదాపు ప్రతి విద్యార్థి ఐఐటీలో అడ్మిష‌న్ పొంద‌డం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఐఐటీలో సీటు రావాలంటే జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్త‌మ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే  జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌లు రాయ‌కుండానే ఐదుగురు విద్యార్థులు ఐఐటీ అడ్మిష‌న్ సాధించారు.

జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్ లేకుండానే ఐదుగురికి విద్యార్థుల‌కు కాన్పూర్ ఐఐటీలో ప్ర‌వేశం ల‌భించిన‌ట్టు ఇండియా టుడే వెల్ల‌డించింది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్‌),  బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్‌)లో ఈ ఐదుగురు సీట్లు ద‌క్కించుకున్నార‌ని తెలిపింది. ఒలింపియాడ్‌లో చూపిన ప్ర‌తిభ ఆధారంగా వీరిని 2025- 26 సెష‌న్‌కి ఎంపిక చేసిన‌ట్టు పేర్కొంది. ఐదుగురు విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో సీఎస్ఈ ఎంచుకున్నారు. వీరికి సంబంధించిన వ్య‌క్తిగ‌త‌ వివ‌రాల‌ను కాన్పూర్ ఐఐటీ (IIT Kanpur) వెల్ల‌డి చేయ‌లేదు.

ఎంపికైన విద్యార్థులలో ఇద్దరు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్ శిక్షణ శిబిరం (IOITC)కు చెందినవారు. మిగ‌తా ముగ్గురు విద్యార్థులు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ శిక్షణ శిబిరం (IMOTC) నుంచి వ‌చ్చారు. ఒలింపియాడ్‌లో సాధించిన విజ‌యాలు, శిక్షణా శిబిరాలకు హాజరు వంటి అంశాల‌తో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్స్‌కు సమాన స్థాయి ప్ర‌మాణాల‌తో వీరిని ప‌రీక్షించారు. ప్ర‌వేశ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే వీరికి సీట్లు కేటాయించారు.

రెగ్యుల‌ర్ విద్యార్థుల్లానే..
ఒలింపియాడ్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులు నేరుగా రెగ్యులర్ కోర్సులో చేర‌తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా అడ్మిష‌న్‌ పొందిన విద్యార్థులతో కలిసి చదువుతారని అధికారులు వెల్ల‌డించారు. వీరికి ప్ర‌త్యేకంగా విద్యా సహాయం చేయ‌డం అంటూ ఏమీ ఉండ‌ద‌ని స్పష్టం చేశారు. అయితే ఒలింపియాడ్ ఎంట్ర‌న్స్.. ఎంపిక చేసిన కొన్ని కోర్సుల‌కు మాత్ర‌మే పరిమితమ‌ని తెలిపారు.

ఒలింపియాడ్ ఎంట్ర‌న్స్ ఈ 5  కోర్సుల‌కు మాత్ర‌మే.
1. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
2. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్
3. ఎకనామిక్ సైన్సెస్
4. బయోలాజికల్ సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్
5. కెమిస్ట్రీ

ఎంపిక ఇలా?
ఒలింపియాడ్స్‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన విద్యార్థుల‌ను రాత ప‌రీక్ష‌కు ఎంపిక చేస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ సిల‌బ‌స్ ప్ర‌కారమే వీరికి రాత ప‌రీక్ష పెడ‌తారు. వీటి ఫలితాలు ఆధారంగా కేంద్ర అడ్మిషన్ల కమిటీ ప్ర‌వేశానికి ఎంపిక చేస్తుంది. మొత్తం ఈ ప్ర‌క్రియ అంతా జేఈఈ అడ్వాన్స్‌డ్స్‌లో అర్హ‌త సాధించిన వారికి స‌రి స‌మానంగా ఉంటుంద‌ని కాన్పూర్ ఐఐటీ తెలిపింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) విజేత‌లతో స‌మాన‌మైన ప్ర‌తిభ ఉన్న‌ ఒలింపియాడ్ విజేతలకు ఐఐటీలో ప్ర‌వేశానికి ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని చెప్పుకోవ‌చ్చు. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులు ఇక నుంచి ఒలింపియాడ్స్‌పైనా ఫోక‌స్ చేయాల్సి ఉంటుంది.

చ‌ద‌వండి: టైమ్స్ కిడ్ ఆఫ్ ది ఇయ‌ర్‌.. ఎవ‌రీ తేజస్వీ మ‌నోజ్‌?

సీఎస్ఈవైపే మొగ్గు
2025 జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (జేఐసీ) నివేదిక ప్రకారం 27,285 మంది అభ్యర్థులు తమ ప్రాధాన్యత జాబితాలో ఐఐటి కాన్పూర్‌లో సీఎస్ఈని ఎంచుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 23,254 ప్రాధాన్యతలతో రెండవ స్థానంలో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ (20,261), సివిల్ ఇంజనీరింగ్ (15,846), కెమికల్ ఇంజనీరింగ్ విత్ పవర్ అండ్ ఆటోమేషన్ (15,758) త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement