
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎంతలా ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఒంటిరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బుని కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అంత ఇంత కాదు. పైగా వయసు మళ్లడంతో వస్తున్న కాల్స్, మెసేజ్‌లు ఒక స్కామ్ అని గ్రహించలేనితనం, టెక్నాలజీ లేమి తదితరాలను ఆసరా చేసుకుని ఈ నేరాగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆగడాలకు చెక్‌పెట్టేలా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది ఈ టీనేజర్. తన తాతమామల్లాంటి ఎందరో వృద్ధులకు భరోసానిచ్చే వెబ్‌సైట్‌ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాదు వాళ్లు కూడా సులభంగా టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ 16 ఏళ్ల అమ్మాయి చేస్తున్న కృషికి మేధావులు సైతం ఆశ్చర్యపోవడమే కాదు, అవార్డులతో ప్రశంసించారు కూడా. ఎవరా ఆ టీనేజర్ అంటే..
ఆ అమ్మాయే 16 ఏళ్ళ తేజస్వి మనోజ్. టెక్సాస్ ఫ్రిస్కోలో హైస్కూల్ జూనియర్‌గా ఉండగా ఆమె ఎదుర్కొన్న సంఘటనే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన తాతగారిలాంటి వృద్ధులు సైబర్ నేరాగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు తన 85 ఏళ్ల తాతాగారి మాదిరిగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు అయిపోయాయని, ఒక లక్ష రూపాయాలు పంపించాల్సిందిగా మెయిల్ ఐడీ, ఫోన్ కాల్స్ రెండూ వచ్చాయి.
దాంతో ఆమె డబ్బు పంపేందుకు రెడీ అవుతుండగా, ఎందుకైనా మంచిది ఒకసారి డబుల్ చెక్‌చేసి పంపు అని తండ్రి సూచన మేరకు చెక్‌చేయడంతో..అదిస్కామ్ అని తేలింది. దాంతో తేజస్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాన్న అలా సూచించి ఉండకపోతే..అంతేగా పరిస్థితి అంటూ ఊపిరి పీల్చుకుంది.
వృద్ధుల సంరక్షణ కోసం..
ఇక ఆ తర్వాత అలాంటి సైబర్ క్రైం నేరాల గురించి ఆరా తీసింది తేజస్వి. ఒక్క 2024 ఏడాదిలోనే ఆన్‌లైన్ స్కామ్‌లకు సంబంధించిన సుమారు రూ. 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి కంగుతింది. అంతేగాదు వాటిల్లో వృద్ధులే ఎక్కువ మొత్తం డబ్బు నష్టపోతున్నట్లు గుర్తించింది.
దాంతో తేజస్వి తన తాతా లాంటి వాళ్లు ఇలాంటి సైబర్ క్రైంలో చిక్కుకోకుండా ఏదైనా చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యింది. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే "షీల్డ్ సీనియర్స్" అనే వెబ్‌సైట్. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం వృద్ధుల సేఫ్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెలల తరబడి కోడింగ్ రాసి దీన్ని డిజైన్ చేసింది. ఈ వెబసైట్ సాయంతో పెద్దలు ఎలాంటి మోసాల్లో చిక్కుకుండా, సులభంగా వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది.
సీనియర్ సిటీజన్లు సులభంగా పాస్‌వర్డ్‌లు, సెట్టింగులు, స్కామ్ వ్యూహాలు గుర్తించేలా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అలాగే తరుచుగా సాంకేతిక పరిభాష సమస్య రాకుండా తక్కవ వాక్యాల సమాధానాల చాట్‌బాట్‌ని కూడా డిజైన్ చేసింది. ఈ వెబ్‌సైట్‌లోని ఏఐ ఆధారిత సాధనం అనుమానాస్పద సందేశాలు, ఇమెయిల్‌లను 95% కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. అంతేగాదు సీనియర్ సిటీజన్లు కూడా ధైర్యంగా ఆన్‌లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేసేలా తయారుచేసింది.
ప్రస్తుతం ఆమె దాన్ని వాణిజ్య ఏఐ ఫ్లాట్‌ఫాంగా మార్చేలా నిధులను సేకరిస్తున్నందున ఈ "షీల్డ్ సీనియర్స్ వెబ్‌సైట్" ప్రివ్యూ మోడ్‌లో ఉంది. అయితే ఇది అమెరికా అసోసీయేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, వాళ్లు నేరుగా ఆమెని సంప్రదించి తమ ఫీడ్‌బ్యాక్‌ని ఇచ్చి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు కూడా. దాంతో తేజస్వి సేవనిరతి ప్రయత్నాలకుగానూ టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 గౌరవం లభించడమే కాదు ఇలా టైమ్ ఫర్ కిడ్స్ సర్వీస్ స్టార్‌గా పేరొందిన తొలి గ్రహితగా ఘనతను కూడా దక్కించుకుందామె.
అంతేగాదు సీనియర్ సిటీజన్లకు ఈ టీనేజర్ సైబర్ సెక్యూరిటీ పాఠాలను కూడా బోధిస్తూ..తన సేవనిరతిని చాటుకుంటోంది కూడా. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ టీనేజ్ వయసులో పెద్దల పట్ల ఇంతలా బాధ్యతతో వ్యవహరిస్తూ..సాంకేతిక సాయం అందిస్తున్న ఆ అమ్మాయి యువతరానికి గొప్ప స్ఫూర్తి కదూ..!.
(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!)