
‘మా అమ్మాయి పైలట్’ ‘నా మనవరాలు పైలట్’ అని చెప్పుకోవడంలో సంతోషం ఉంది. అంతకంటే ఎక్కువ సంతోషం ఆమె నడుపుతున్న విమానంలో ప్రయాణించడంలో ఉంది. ఇండిగో పైలట్ తనిష్క ముగ్దల్ తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలకు విమానం ఎక్కడం అదే మొదటి సారి. అది తమ ఇంటి ఆడబిడ్డ నడిపే విమానం.
యూనిఫామ్‌లో ఉన్న తనిష్క ఆనందబాష్పాలతో అమ్మా,నాన్నలు, తాత,అమ్మమ్మలకు ఇండిగో విమానంలో స్వాగతం పలుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో క్లిప్‌లో భారీ సంభాషణలు, గ్రాఫిక్స్ హంగామా లేకపోవచ్చు. భావోద్వేగాలే బలం అయ్యాయి.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ...‘అమ్మానాన్నల ప్రోత్సాహం, చేసిన ప్రార్థనలు, చేసిన త్యాగాలు నేను పైలట్ కావడానికి తోడ్పడ్డాయి’ అని రాసింది తనిష్క. ‘ఆ తల్లిదండ్రుల కళ్లలో ఎంత సంతోషం కనిపిస్తుందో చూడండి’
‘పిల్లలు మంచి స్థాయికి వెళ్లినప్పుడు, ఆ స్థాయిని కళ్లారా చూసినప్పుడు, వారికి అంతకు మించిన శక్తి ఏముంటుంది!’ ‘మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను ఎప్పుడూ గుండెలో పెట్టుకోవాలి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
(చదవండి: విలేజ్ సైంటిస్ట్ బనిత)