
‘అలా సరే, ఇలా అయితే ఎలా ఉంటుంది?’ అని ఆలోచించడమే ఆవిష్కరణ. వచ్చిన ఆలోచనను ఇష్టపడి, కష్టపడి నిజం చేసుకోవడమే ఆవిష్కరణ. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఆమెకు తెలుసో లేదో తెలియదు. ఆమె సైన్స్ పుస్తకాలు చదివింది కూడా లేదు. అయితే కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే ఆమె ఇష్టం. అదే సమయంలో మనం మరిచిపోయిన సంప్రదాయ వస్తువులు అంటే ఇష్టం. వాటిని ఈ తరానికి పరిచయం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అంటే ఇష్టం.
పశ్చిమబెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన బనితకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికి పైగాఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది.ఇందులో ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా...ఫ్యాన్ స్ట్రక్చర్, ప్లాస్టిక్ బాక్స్,నీళ్లు, ఐస్, వైర్‌లను ఉపయోగించి ‘మినీ ఏసీ’ తయారుచేసింది. ‘ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఎలా తయారుచేయాలో తెలుసా?’ అంటూ డెమో కూడా ఇచ్చింది.
‘విలేజ్‌లైఫ్ విత్ బనిత’ ట్యాగ్‌లైన్‌తో బనిత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేసే వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేయడమే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
(చదవండి: చేతుల పరిశుభ్రత కోసం..!)