2028 ఒలింపిక్స్ అర్హత ప్రక్రియకు ఐఓసీ ఆమోదం
న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జట్లను ఎంపిక చేసే ప్రక్రియను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గురువారం వెల్లడించింది. విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 12 జట్ల చొప్పున పోటీ పడనుండగా... ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా పాల్గొననుంది. ఇక మిగిలిన 11 జట్లను ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్, ఐదు కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
‘ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ 2025–26, 2026–27 సీజన్‌లలో విజేతగా నిలిచిన జట్లు విశ్వక్రీడలకు ఎంపికవుతాయి. ఒకవేళ రెండు సీజన్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిస్తే... రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు కూడా విశ్వక్రీడలకు అర్హత పొందుతాయి.
ఒకవేళ కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు అప్పటికే ప్రొ లీగ్ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటే... తదుపరి స్థానంలో ఉన్న జట్టుకు ఆ అవకాశం దక్కుతుంది’ అని ఎఫ్‌ఐహెచ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2028 ఆరంభంలో ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లను సైతం నిర్వహించనున్నారు. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొననున్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు కూడా ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటాయి.


