రైల్వే టికెట్ల కొనుగోళ్లలో దుర్వినియోగానికి చెక్
న్యూఢిల్లీ: చివరి నిమిషం ప్రయాణాలకు వరప్రదమైన తత్కాల్ టికెట్ల దుర్వినియోగానికి చెక్ పెట్టే దిశగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజర్వేషన్ కేంద్రాల వద్ద తత్కాల్ టికెట్ల కొనుగోలు చేసేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) వినియోగాన్ని తప్పనిసరి చేసింది. ప్రయాణికులు రిజర్వేషన్ ఫారంలో నింపే తమ మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని వెల్లడించి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ‘ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే నవంబర్ 17వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసి చూస్తున్నాం. ప్రస్తుతం కొన్ని రైళ్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా దీనిని పరీక్షిస్తున్నాం. త్వరలో చాలా స్టేషన్లకు విస్తరిస్తాం.
అనంతరం దేశమంతటా ఇదే విధానం అమల్లోకి వస్తుంది‘ అని రైల్వే శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఓటీపీ అనుసంధాన తత్కాల్ టికెట్ కొనుగోలు ప్రక్రియను అమల్లోకి తెచ్చిన కారణంగా తత్కాల్ టికెట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. తత్కాల్ టికెట్ల జారీలో పారదర్శకత మరింత పెరుగుతుంది’’ అని రైల్వేశాఖ పేర్కొంది. ఆన్‌లైన్‌లో తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ గత జూలైలో నిబంధన తెచ్చింది. బుకింగ్స్ మొదలైన తొలి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ ధ్రువీకృత యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ సైట్, యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేలా నిబంధనలు మార్చిన విషయం విదితమే.


