భారీ స్థాయిలో ప్రక్షాళన మొదలెట్టిన కేంద్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన మరణాల జాబితాతో సరిపోల్చి కార్డుల డీయాక్టివేషన్
న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు ఆధార్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జనాభా లెక్కలు చూసే రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రజా పంపిణీ వ్యవస్థలు, నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ల నుంచి సేకరించిన పౌరుల మరణాల జాబితాతో ఆధార్ ఐడీలను సరిపోల్చి మృతుల సంబంధ ఆధార్ గుర్తింపు(ఐడీ)లను నిర్వీర్యంచేస్తోంది. ఇలా తాజాగా 2 కోట్లకుపైగా ఐడీల డీయాక్టివేషన్ పూర్తయినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎప్పటికప్పుడు ప్రక్షాళనతో ఆధార్ కార్డుల సంఖ్యలో ప్రభుత్వానికి సైతం ఒక స్పష్టత ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆధార్ డేటాబేస్ సమగ్రతను కాపాడటంతోపాటు ఆధార్ ఐడీ నంబర్ల దుర్వినియోగానికి అడ్డుకట్టవేసేందుకే దేశవ్యాప్తంగా ఇలా ఒకేసారి భారీస్థాయిలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మరణించిన వారి ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకూడదని భావించే కుటుంబసభ్యులు సొంతంగా కూడా ‘మైఆధార్ పోర్టల్’ ద్వారా ఆయా ఐడీల డీయాక్టివేషన్‌ను కోరవచ్చు. మరణాన్ని ధృవీకరించేముందు ఆయా కుటుంబసభ్యులు తమ ఐడీని ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతోపాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తుల వివరాలను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సంస్థ అధికారులు పరిశీలిస్తారు. తనిఖీల తర్వాత మృతుల ఆధార్ ఐడీలను డీయాక్టివేట్ చేస్తారు.
పునరుద్ధ్దరణ కూడా సాధ్యమే
జీవించి ఉన్న పౌరుల ఆధార్ ఐడీ పొరపాటున డీయాక్టివేట్ అయితే తిరిగి పునరుద్ధరణ(రీయాక్టివేట్)కు సైతం ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. తాము జీవించే ఉన్నామని తెలిపే ఆధారాలను సమరి్పస్తే వెంటనే పాత ఐడీ కార్డును రీయాక్టివేట్ చేస్తారు. మృతుల ఆధార్ ఐడీలను తొలగించే క్రతువుకు అధికారులు 2024 ఏడాదిలోనే మొదలెట్టారు. అది ఈ ఏడాది పొడవునా కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై రెండోవారం నాటికి 1.17 కోట్ల ఐడీలను తొలగించారు.
సెపె్టంబర్ నాటికి 1.4 కోట్ల ఐడీలు, తాజాగా 2 కోట్లకుపైగా ఐడీలను తొలగించారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పౌర నమోదు వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. ఏ జిల్లాలో ఎంత మంది మరణించారనే వాస్తవిక గణాంకాలు కూడా చాలా రాష్ట్రాల వద్ద సమగ్రస్థాయిలో లేవు. ఇలాంటి అస్పష్టతల నడుమ ఉన్నపళంగా ఆధార్ ఐడీలను క్రియాశీలక స్థితి నుంచి తప్పిస్తే ఎంతో మంది పౌరులు అవస్థలు పడతారని సామాజికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఈ ఆధార్‌ఐడీల పొరపాటు తొలగింపు అనేది పెద్ద అవరోధంగా మారుతుందని వాళ్లు వ్యాఖ్యానించారు.


