దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. రోజువారీ ఆర్థిక కార్య కలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు అన్నింటికీ ఇదే ‘ఆధారం’. ఇంత కీలకమైన ఆధార్కు సంబంధించిన పలు ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత అంటే కొత్త ఏడాది 2026లో నూతన నిబంధనలు అమలు కాబోతున్నాయి.
ఆధార్ కార్డు కొత్త డిజైన్
ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు, డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ ఇప్పటికే 2025 డిసెంబర్ 1 నుంచే ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది. ఈ కొత్త కార్డులో మీ ఫోటో, సురక్షిత క్యూర్ కోడ్ మాత్రమే ఉంటుంది. మీ పేరు, ఆధార్ నంబర్ ఉండవు. మొత్తం కార్డుల డిజైన్ను 2026 జూన్ 14 లోపు అప్డేట్ చేయనుంది యూఐడీఏఐ.
ఫోటోకాపీల వాడకంపై ఆంక్షలు
కొత్త యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను (జిరాక్స్) ఇవ్వాల్సిన పని లేదు. గుర్తింపు ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆఫ్లైన్ ఆధార్ ఎక్స్ఎంఎల్, మాస్క్డ్ ఆధార్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. డిజిటల్ ధ్రువీకరణను ప్రాథమిక ఎంపికగా చేస్తున్నారు. ఫేస్ అథెంటికేషన్ను చట్టపరమైన గుర్తింపుగా చేయనున్నారు.
ఆధార్-పాన్ లింక్ గడువు
ఆధార్-పాన్ లింక్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ తేదీ నాటికి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే, అది 2026 జనవరి 1 నుండి ఇనాక్టివ్గా మారుతుంది. దీంతో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్, ఇతర ఆర్థిక లావాదేవీలు కష్టమవుతాయి.
10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డుల అప్డేట్ తప్పనిసరి
మీడియా నివేదికల ప్రకారం.. 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని వాటిని ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ చేయించకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి సమాచారాన్ని అప్ డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్ గా ఉండటమే కాకుండా ధ్రువీకరణ సమయంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.


