ప్రేమ, నమ్మకం, ద్రోహం... ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక యువకుని దీనగాథ ఇది. అబద్ధపు ఆరోపణల కారణంగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన ఆ యువకుడి కేసు.. 'పోక్సో (POCSO) చట్టం' దుర్వినియోగానికి ఒక ఉదాహరణగా నిలిచింది. తన స్నేహితురాలిని ఆమె ప్రియుడు తప్పుదారి పట్టిస్తున్నాడని భావించి, అతనితో స్నేహం మానుకోవాలని చెప్పినందుకు ఆ యువకుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు.
ఈ కేసులో బాధితుడు అయిన యువకుడు తన స్నేహితురాలి ప్రియుడి ప్రవర్తన సరిగా లేదని గుర్తించాడు. అతనితో తిరగడం ప్రమాదకరమని భావించి, ఆ మైనర్ బాలికను పలుమార్లు హెచ్చరించాడు. అతనికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న ఆ బాలికకు ఈ సలహా నచ్చలేదు. సరిగ్గా ఇదే సమయంలో, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడిని రక్షించేందుకు, చట్టపరమైన సమస్యల నుంచి తన ప్రియుడిని తప్పించేందుకు అతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి స్థానంలో తనకు సలహా ఇచ్చిన నిర్దోషి అయిన స్నేహితుడిపైనే తప్పుడు పాక్సో(POCSO) కేసు పెట్టింది. ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అబద్ధపు సాక్ష్యం కారణంగా ఆ యువకుడు ఏకంగా ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ లభించడం కూడా కష్టమైంది.
ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదల
ఒక ఏడాది పాటు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కోర్టు విచారణలో, సాక్ష్యాధారాలు, బాలిక వాంగ్మూలంలోని పరస్పర విరుద్ధ అంశాలను న్యాయవాది నిరూపించగలిగారు. చివరకు నిజం బట్టబయలైంది: బాలిక తన ప్రియుడిని రక్షించేందుకు, తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కుట్రకు పాల్పడిందని రుజువైంది. దాంతో కోర్టు ఆ నిర్దోషి అయిన యువకుడిని తక్షణమే విడుదల చేసింది. అయితే ఆ యువకుడు అంతవరకూ కోల్పోయిన కాలాన్ని, సామాజిక గౌరవాన్ని తిరిగి ఎవరూ ఇవ్వలేరు. మరోవైను ఈ ఘటన అతని భవిష్యత్తుకు అడ్డుగోడగా మారింది.
న్యాయవ్యవస్థ ముందు ప్రశ్నలు
Innocent Minor boy spent 1 YEAR in Jail in false POCSO case filed by his friend because he used to ask her to avoid her boyfriend who was of wrong behaviour
Minor girl had sex with BF but implicated friend when family came to know of her affairpic.twitter.com/I6Yj3xbfN0— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 4, 2025
ప్రేమ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి, ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేసిన ఆ బాలికకు ఎందుకు శిక్ష పడలేదు? అలాగే ఆ బాలిక ఇటువంటి కుట్రకు పాల్పడేందుకు ఆమె ప్రియుడు సహకరించివుంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అమాయక యువకుడిపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టం రక్షణగా ఉండాల్సింది పోయి, ఏడాదిపాటు శిక్షకు కారణంగా నిలిచింది. ఈ ఘటన పాక్సో(POCSO) లాంటి కఠిన చట్టాల దుర్వినియోగం ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది. మైనర్ల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు, ఈ విధంగా దుర్వినియోగం కావడం సమాజానికి మంచిది కాదని పలువురు అంటున్నారు. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల నిజమైన బాధితులు అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేసే మైనర్లను, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పాక్సో (POCSO) చట్టంలో తగిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. హర్యానాలోని పానిపత్‌లో జరిగిన ఒక ఉదంతం ఆధారంగా ఈ కథనం రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ట్విట్టర్‌లో దీపికా నారాయణ్ భరద్వాజ్ పేరుతో షేర్ అయిన సోస్టు జత చేయడం జరిగింది. దీనిలో న్యాయవాది తమన్నా కాదియాన్ ఈ అంశంపై మాట్లాడటాన్ని చూడవచ్చు.
ఇది కూడా చదవండి: భారత్ అణు పరీక్షలు?.. పాక్‌కు దబిడి దిబిడే!


