భారతీయ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. టికెట్ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే..
అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
చివరిసారి రైల్వే ఛార్జీల పెంపు 2025 జూలైలో జరిగింది. ఆ పెంపుతో రైల్వేకు సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.


