సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.
టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.
టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.


