కర్నూలులోనే హెచ్‌ఆర్‌సీ,లోకాయుక్త
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
విజయవాడకు తరలిస్తామన్నగత వైఖరి నుంచి యూటర్న్
జగన్ ప్రభుత్వ నిర్ణయంపై గతంలో నానా యాగీ
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేయడంపై నానా యాగీ చేసి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ.. ఇప్పుడు జగన్ విజన్‌కే జై కొట్టింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తలను విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని గతంలో హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని కర్నూలులోనే కొనసాగిస్తామని తాజాగా హైకోర్టుకు వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ విధాన నిర్ణయంలో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
ఈ వ్యవహారంలో 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ రికార్డుల్లో లేకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగిస్తామని చెప్పారు.


