మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య
మేనిఫెస్టోను అటకెక్కించి.. సూపర్ సిక్స్‌కు చెదలు పట్టించి..
సంపద సృష్టికి చెల్లుచీటి ఇచ్చి.. అవినీతిని విశృంఖలం చేసి..
కనీవిని ఎరుగని అప్పులు చేసి.. ప్రతి పనిలో కమీషన్లు కొట్టేసి..
రాజకీయ పాలన పేరుతో రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపి..
ఆ తప్పులన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు బాబు ఆపసోపాలు..
సీఎం ఎత్తుగడ చూసి అవాక్కయిన కలెక్టర్లు.. చేసిందంతా చేసి వేరేవాళ్లపై నెట్టేయడం బాబుకు అలవాటేనని అధికారుల్లో చర్చ
రాష్ట్రంలో 49 శాతం మంది ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న సీఎం
రైతులు తమ పంటలకు ధరలు రావడం లేదంటున్నారు
ప్రజలు విద్యుత్ బిల్లులు, కోత సమస్యలను ఎదుర్కొంటున్నారు
రోడ్లు, తాగునీరు, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలున్నాయి
మనం బాగా పని చేశామనుకుంటున్నాం కానీ.. ఏదో మిస్ అవుతున్నాం
ఎన్నికలు లేకపోతే డిక్టేటర్‌లా 20 ఏళ్లకు ప్లాన్‌చేసి కొట్టేయచ్చు
ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం.. పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోతున్నారన్న సీఎం
సాక్షి, అమరావతి: గద్దెనెక్కిన పద్దెనిమిది నెలల కాలంలో మూటగట్టుకున్న వైఫల్యాలన్నిటినీ అధికారులపైకి నెట్టేసి చేతులు దులుపుకుందామనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుని చూసి కలెక్టర్లంతా అవాక్కయ్యారు. తప్పులన్నిటినీ అధికారులపై పడేసి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం ఆయనకు పరిపాటే. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఇది మరింత ప్రస్ఫుటమయ్యింది.
మేనిఫెస్టోకు అసలు విలువే ఇవ్వకుండా.. సూపర్ సిక్స్ సూపర్ సెవన్ హామీలను అటకెక్కించేసిన చంద్రబాబు ‘మన పనితీరును జనం మెచ్చడంలేదు’ అంటూ ఇప్పుడు తన వైఫల్యాలన్నీ అధికారులపైకి నెట్టేసేందుకు ఆపసోపాలు పడ్డారు. పొలిటికల్ గవర్నెన్స్ కీలకమని చంద్రబాబు ఈ సమావేశంలో పునరుద్ఘాటించారు. నిజానికి ఆయన ‘రాజకీయ పాలన’ 18నెలలుగా సాగుతూనే ఉంది.. సోషల్ మీడియాపై దాడులు చేస్తూ, ప్రతిపక్షంపై దాడులు చేస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆయన పాలన సాగుతోంది.
సంపద పెంచకపోగా అడుగడుగునా అవినీతి, కనీవిని ఎరుగని రీతిలో అప్పులు, ప్రతిదాంట్లోనూ కమీషన్లు చూసి జనం ఛీత్కరించుకోక ఏం చేస్తారు? అయితే ఈ ఛీత్కారాలు, వైఫల్యాలు తనపైకి రాకుండా వేరేవాళ్లపైకి తోసేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. అన్నిటికీ బాధ్యత తనదే అయినా కలెక్టర్లపైకి నెట్టేసేందుకు కలెక్టర్ల సదస్సును ఆయన వేదికగా చేసుకున్నారు. రాష్ట్రంలో 49 శాతం మంది ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని, మన పని తీరును జనం మెచ్చడం లేదని అధికార యంత్రాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
‘మీరు, నేను బాగా పని చేశామనుకుంటున్నాం.. కానీ ప్రజలు మాత్రం మెచ్చడం లేదు. ప్రజలకు సంతృప్తి లేకుండా పని చేస్తున్నాం. ఎక్కడో, ఏదో మిస్ అవుతున్నాం. ప్రజలు మనతో కలిసి వస్తున్నారా? లేదా? చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. డేటా చూస్తే.. కొన్ని అంశాల్లో మనం చేసే పనులను ప్రజలు మెచ్చడం లేదనే అవగాహన వచ్చిందన్నారు.
రహదారులు, పంచాయతీరాజ్, తాగునీరు, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలున్నాయని, రైతులు పంటలకు ధరలు రావడం లేదంటున్నారని, భూముల సమస్య ఉందని, విద్యుత్ బిల్లులు పెరిగాయని, ప్రజలు విద్యుత్ కోత సమస్యలను ఎదుర్కొంటున్నారని సీఎం చెప్పారు. అంకెలతో సమస్యలు తీరవన్నారు.
ఎన్నికలే లేకపోతే 20 ఏళ్లు కొట్టేయచ్చు
ప్రభుత్వానికి కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల పాజిటివ్ వాతావరణం రావాలంటే వారిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలు లేకపోతే డిక్టేటర్, చైనాలా 20 ఏళ్లు ప్లాన్ చేసుకుని కొట్టేయవచ్చునన్నారు. కానీ ఇక్కడ ఐదేళ్లకోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని, అందుకే రాజకీయ గవర్నెన్స్ కీలకమన్నారు.
పారిశ్రామికవేత్తలు తిరుగుముఖం
విశాఖ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం చెప్పారు. పరిశ్రమల అనుమతులకు జాప్యం చేస్తుండటంతో కొంత మంది పెట్టుబడిదారులు తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేవారిని కలెక్టర్లు, మంత్రులు తక్కువగా చూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించి జనవరి నుంచి ఫైళ్లు, సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే క్లియర్ చేయాలని ఆదేశించారు. జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీకి వస్తానని సీఎం ప్రకటించారు.
ఆ డబ్బులతో మరో రెండు మెడికల్ కాలేజీలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీలో ఇవ్వడం వల్లే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల కంటే కార్పొరేట్ ఆస్పత్రులే బాగా పనిచేస్తాయన్నారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృథా చేశారని విమర్శించారు.
ఆ డబ్బులు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లమని, రుషికొండ ప్యాలెస్ తెల్ల ఏనుగులా మారిందన్నారు. రోడ్లను కూడా పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారని, మరి అవి ప్రైవేటు వ్యక్తులవి అయిపోతాయా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని, విమర్శలు చేస్తే భయపడేది లేదన్నారు.
సచివాలయాల ఉద్యోగుల పనితీరుపై సమీక్ష
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, క్షేత్రస్థాయి ఉద్యోగుల పనితీరును సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగం రోజువారీ విధులకు హాజరు కావాల్సిందేనని, నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులను నియమించి 100 శాతం నిర్వహణ వ్యయం పెంచేసిందని విమర్శించారు.
ఆహా..! అలవోకగా అబద్ధాలు
సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామంటూ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలైన నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3,000 చొప్పున భృతి, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18,000 హామీలను నెరవేర్చకుండానే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామంటూ సీఎం చెప్పడం పట్ల కలెక్టర్లు కంగుతిన్నారు.
ఇక 1వతేదీ సెలవు వస్తే ముందు రోజే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్లు చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో చెప్పారు. అయితే ఒక్క నెల మినహా ఏనాడూ 1వతేదీన జీతాలు ఇచ్చిన పాపాన పోలేదని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.


