మెడి‘కిల్‌’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన | YSRCP has launched a fierce protest against Chandrababu government's decision to privatize government medical colleges in AP | Sakshi
Sakshi News home page

మెడి‘కిల్‌’పై మహోద్యమం.. కోటి గళాల సింహగర్జన

Dec 18 2025 3:20 AM | Updated on Dec 18 2025 3:20 AM

YSRCP has launched a fierce protest against Chandrababu government's decision to privatize government medical colleges in AP

కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న వాహనాలు

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు ఒప్పుకోం..

చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ సమరభేరి 

నేడు కోటి సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్న వైఎస్‌ జగన్‌ 

ప్రభుత్వ కుట్రపై ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాల.. 

స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు 

కమీషన్ల కోసం ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ 

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్‌ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటన  

అక్టోబర్‌ 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించిన వైఎస్‌ జగన్‌ 

అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ వరకు గ్రామాల్లో, పట్టణాల్లో రచ్చబండ  

స్కాముల కోసం పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్న తీరును వివరించిన వైఎస్సార్‌సీపీ నేతలు 

చంద్రబాబు సర్కార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు 

నవంబర్‌ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్‌ సక్సెస్‌ 

ఈ నెల 10న 175 నియోజకవర్గాల్లో సంతకాల ప్రతులతో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం.. 

ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో కదంతొక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు 

కోటి సంతకాల మహోద్యమాన్ని అణచి వేసేందుకు సర్కార్‌ విఫలయత్నం 

అడ్డంకులు సృష్టించినా కోటి గళాలు సింహగర్జన చేశాయంటున్న రాజకీయ పరిశీలకులు

సాక్షి, అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలు­పు ప్రభంజనమైంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు సర్కార్‌పై కళ్లెర్ర చేశారు. కోటి గళాలతో సింహగర్జన చేశారు.

నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగసి పడటంతో కోటి సంతకాల ఉద్యమం ప్రజా మహోద్యమంగా మారింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలసి కోటి సంతకాల ప్రతులను అందిచనున్నారు. గద్దెనెక్కిన 18 నెలల్లోనే చంద్రబాబు సర్కార్‌ రూ.­2,81,312 కోట్లు అప్పు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. నెలకు రూ.15,628.44 కోట్లు.. రోజుకు రూ.­520.94 కోట్లు చొప్పున అప్పు చేసింది. అంటే.. ఒక్క రోజులో చేసిన అప్పుతో ఒక మెడికల్‌ కాలేజీని పూర్తి చేయొచ్చు. కేవలం పది రోజుల్లో చేసిన అప్పుతో మెడికల్‌ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేయొచ్చు.

కానీ.. అందుకు విరుద్ధంగా అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను దుబారా చేస్తూ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి నిధుల్లేవని సాకు చూ­పుతూ.. ప్రైవేటీకరణ ముసుగులో వాటిని చంద్రబాబు సర్కార్‌ బినామీలకు కట్టబెట్టాలన్న కుట్రపై జనం భగ్గుమన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలలో గ్రామాలు.. పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు సర్కార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలకు చెందిన 1,04,11,136 మంది ప్రజలు స్వచ్ఛందగా సంతకాలు చేశారు.

ఆ సంతకాల ప్రతులు 26 జిల్లాల నుంచి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఆ సంతకాల ప్రతులను గురువారం గవర్నర్‌కు అందజేయనున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిలుపుదల చేసి.. వాటిని ప్రభుత్వమే నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.  

14 ఏళ్లలో ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టని చంద్రబాబు  
రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్‌ మెడికల్‌ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడు సార్లు అంటే 1995–99, 1999–04, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆ మూడు దఫాల్లో ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కూడా కట్టలేదు.

కనీసం కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను పునర్విభజించి, 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు.

ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు నాణ్యమైన వైద్యం అందించడం.. పేదలకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి 50 ఎకరాల కనీస స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా ఖర్చు చేసి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.

కోవిడ్‌ మహమ్మారి వంటి సమస్యలు రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి, తరగతులు మొదలుపెట్టారు.

గతేడాది ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా తరగతులు ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.  

కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట  
పులివెందుల మెడికల్‌ కాలేజీలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్‌ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట.

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్‌సీపీ సర్కార్‌ రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి.

ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో కూడా వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి.

కొత్త మెడికల్‌ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగితే.. మొత్తంమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తరగతులు ప్రారంభమైన కొత్త మెడికల్‌ కాలేజీల్లో అప్పట్లోనే 800 సీట్లు భర్తీ చేశారు. పులివెందుల మెడికల్‌ కాలేజీలో తరగతులు ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్‌ అంగీకరించి ఉంటే మరో 50 సీట్లు వచ్చేవి.

ఎక్కడ వైఎస్‌ జగన్‌కు క్రెడిట్‌ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వ రంగంలోనే మెడికల్‌ కాలేజీలన్నీ అందుబాటులోకి వచ్చేవి.

అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం  
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతుండటం.. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తుండటంతో చంద్రబాబు సర్కార్‌ వెన్నులో వణుకు పు­ట్టింది. రచ్చబండ కార్యక్రమాలపై పోలీసులను ఉసిగొల్పి ప్రజా ఉద్యమాన్ని అణచివేసే దుస్సాహసంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.

చంద్రబాబు స­ర్కా­ర్‌ ప్రజా వ్యతిరేక చర్యలపై సమర భేరి మోగించింది. నవంబర్‌ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. ఈ నెల 10న ఏపీలోని 175 నియోజక­వ­ర్గాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా చేసిన సంతకాల ప్రతులను ప్రదర్శిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు.

పోలీసుల ద్వారా ర్యాలీలను అడగడుగునా అడ్డుకోవడానికి చంద్రబాబు చేసిన కుట్రలను జనం పటాపంచలు చేశారు. ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో వి­ద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి బాబు సర్కార్‌పై రణభేరి మో­గించారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయా­న్ని ఉపసంహరించుకోవాలంటూ కోటి గళాలు సింహగర్జన చేశాయి.  

మహోద్యమంగా ప్రజా ఉద్యమం 
కమీషన్ల కక్కుర్తితో మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాల­ని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించడాన్ని నిరసిస్తూ అక్టోబర్‌ 7న వైఎస్‌ జగన్‌ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. అక్టోబర్‌ 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించి సమరభేరి మోగించారు. అక్టోబర్‌ 10 నుంచి నవంబర్‌ ఆఖరు వరకు 175 నియోజకవర్గాల్లో గ్రామాలు, పట్టణాల్లో వైఎస్సార్‌సీపీ నేత­లు విస్తృతంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు.

భవిష్యత్తులో రూ.లక్ష కో­ట్ల విలువ చేసే మెడికల్‌ కాలేజీలను బినామీలకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను.. పేదలకు నాణ్యమై­న వైద్యం, వైద్య విద్యను దూరం చేస్తున్న దురాగతాన్ని ప్రజల కళ్లకు కట్టినట్టు వివరించారు. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చంద్రబాబు సర్కార్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ.. మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించి, నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement