సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.
‘‘మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం. అలాంటి వన్నీ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్ గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను ఆపేశారు. అధికారంలోకి వచ్చాక ఒకమాట, రాకముందు ఒక మాట చెప్పటం చంద్రబాబుకు అలవాటే’’ అంటూ సజ్జల మండిపడ్డారు.
‘‘దాదాపు పది కాలేజీల నిర్మాణం పూర్తయినా ఎందుకు పీపీపీ కి వెళ్తున్నారు?. ప్రైవేట్ వారు ఉచితంగా వైద్యం ఎందుకు చేస్తారు?. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక పెద్ద స్కాం ఉంది. కోటి సంతకాలకు పిలుపు ఇవ్వగానే జనం బాగా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక రెఫరెండం లాగా తీసుకున్నారు. ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చి సంతకాలు చేశారు. చంద్రబాబు ఇప్పుడు కాస్త తగ్గి ప్రజలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మొదట కోరుకునేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే అధికారంలోకి రాగానే పీపీపీ అన్నారంటే అంతకుముందే కుట్రకు ప్లాన్ చేసినట్టు అర్థం అవుతుంది.
..ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. పీపీపీ వెనుక పెద్ద కుంభకోణం ఉంది. రెండో స్కాం జీతాలు చెల్లించటం వెనుక ఉంది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబుకు పాపభీతి ఏమాత్రం లేదు. ఒక కోటికి పైగా సంతకాలు రెండు నెలల్లోనే వచ్చాయి. చేసిన అప్పుల్లో కొంత పెట్టినా పూర్తవుతాయి’’ అని సజ్జల పేర్కొన్నారు.


