సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని.. వైఎస్ జగన్ ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలోనే ఏడు కాలేజీలు పూర్తి చేశాం.. కానీ చంద్రబాబు వచ్చాక స్కామ్‌లకు తెర తీశారు.’’ అని ఆయన మండిపడ్డారు.
‘‘మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఈ వ్యతిరేకతను రేపు(డిసెంబర్ 18, గురువారం) గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం దారుణం. దీని వెనుక పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. కిక్ బ్యాగుల రూపంలో కమీషన్లు దండుకుంటున్నారు’’ అని అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతారా?. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్‌కే అప్పగిస్తారేమో?. ఏం మేలు చేశారని ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు?. ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉందో కోటి సంతకాల ద్వారా తేటతెల్లం అయింది. ప్రజల డిమాండ్, వారి ఆకాంక్షను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం’’ అని గుడివాడ్ అమర్‌నాథ్ పేర్కొన్నారు.


