ఎస్‌ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేశారన్నతెలంగాణ ఆరోపణ తప్పు
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం వాదన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని.. సమన్యాయం చేశామని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభుత్వం వివరించింది. శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్‌ఆర్‌బీసీ)తో పోల్చితే ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ)ను నిర్లక్ష్యం చేశారన్న తెలంగాణ ఆరోపణ తప్పని పేర్కొంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఆయకట్టు 6.6 లక్షల ఎకరాల కంటే తగ్గలేదని ఎత్తిచూపింది.
కృష్ణా జలాల కేటాయింపులో, వినియోగంలో అన్యాయం చేశారంటూ తెలంగాణ చేస్తున్న వాదనలకు చట్టపరమైన, చారిత్రక ఆధారాలు లేవని వాదించింది. ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 గురువారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా ఈమేరకు తుది వాదనలు కొనసాగించారు.
పునఃసమీక్షించవద్దు..
బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిందని, అందువల్ల బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించకూడదని జైదీప్ గుప్తా వాదించారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపును కొనసాగించాలని కోరారు.
బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు అమల్లోకి రావడంతో 1944, ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత లేకుండా పోయిందని.. దాన్ని చూపుతూ కేసీ కెనాల్, ఆర్డీఎస్‌ల కింద సమాన వినియోగం కోసం నీటిని కేటాయించాలని తెలంగాణ చేస్తున్న వాదన అసంబద్ధమని చెప్పారు. తెలంగాణ కేసీ కెనాల్‌ను కుడి కాలువగా.. ఆర్డీఎస్‌ను ఎడమ కాలువగా పోల్చడం ఊహాజనితమన్నారు.
ఇక ఎస్‌ఆర్‌బీసీతో పోల్చితే.. ఎస్‌ఎల్‌బీసీని నిర్లక్ష్యం చేశారని తెలంగాణ ఆరోపించడం విడ్డూరమన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేయలేదని ఎత్తిచూపారు. జైదీప్ గుప్తా గురువారం కూడా వాదనలు కొనసాగించనున్నారు. ఈ విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు హాజరయ్యారు.


