వెబ్ కాస్టింగ్‌ను పరిశీలిస్తున్న ఎన్నికల కమిషనర్ రాణికుముదిని, సీఎస్ రామకృష్ణారావు
అత్యధికంగా యాదాద్రి, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో పోలింగ్
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్, సీఎస్, డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్‌లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.
తుది విడతలో ఇలా....
182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్‌లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి.
ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది.
మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్‌ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు
మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్‌ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు.


