కొత్త హైకోర్టు పనులపై సీఎస్‌ వికాస్ రాజ్ సమీక్ష | Special CS Vikas Raj Reviews Progress of New High Court Complex at Rajendranagar | Sakshi
Sakshi News home page

కొత్త హైకోర్టు పనులపై సీఎస్‌ వికాస్ రాజ్ సమీక్ష

Dec 17 2025 7:39 PM | Updated on Dec 17 2025 8:17 PM

Special CS Vikas Raj Reviews Progress of New High Court Complex at Rajendranagar

సాక్షి,హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు భవన సముదాయం పనుల పురోగతిని రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్లు (బిల్డింగ్స్, ఎలక్ట్రికల్), ఆర్‌అండ్‌బీ ఫీల్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ సంస్థ డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కన్సల్టెంట్లు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. పనుల వేగం, క్రమబద్ధత, నాణ్యతను వికాస్ రాజ్ సమీక్షించి, వివిధ దశల పూర్తి కాలపట్టికలను ఖరారు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 కోట్లు, ఫర్నిచర్ మరియు ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది.

పనుల సమీక్షలో భాగంగా, డ్రాయింగ్‌లను ముందుగానే సమర్పించాలని కన్సల్టెంట్లను వికాస్ రాజ్ ఆదేశించారు. తద్వారా కార్మికులు, సామగ్రి, యంత్రాల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పనుల పూర్తి కార్యక్రమాన్ని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్), కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ కలిసి రూపొందించాలని, దానిపై తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఒప్పందంలో పేర్కొన్న మైలురాళ్ల ప్రకారం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. న్యాయ అధికారుల సూచనలకు అనుగుణంగా మార్పు చేసిన నమూనాలను ఆలస్యం లేకుండా సిద్ధం చేసి, అనుమతులు పొందాలని కన్సల్టెంట్లకు ఆదేశించారు. జోన్-2కు సంబంధించిన అటవీ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు సూచించారు.

డిజైన్ మార్పుల వల్ల ఏర్పడిన ఆలస్యాలను అధిగమించేందుకు శాఖ, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని, ప్రాజెక్టును సమయానికి పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement