ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటుకు నిరాకరణ
మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గాందీకి ఊరట
ఇంకా తేలని మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవిత
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన బీఆర్‌ఎస్.. హైకోర్టుకు వెళ్తామని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. బీఆర్ ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా.. స్పీకర్ బుధవారం ఐదుగురి పిటిషన్లపై తీర్పు వెలువరించారు.
బీఆర్‌ఎస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగినట్లు ఆ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. స్పీకర్ ఉత్తర్వులను శాసనసభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.
దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీకి ఊరట లభించినట్లయింది.
మరో ఐదుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ఎప్పటి లోగా నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
అందరి వాదనలు విన్నాకే..: రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నియమావళిని అనుసరించి డాక్టర్ తెల్లం వెంకట్‌రావు (భద్రాచలం)పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.
అదే తరహాలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల)పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి; ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)పై కల్వకుంట్ల సంజయ్; గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు)పై చింత ప్రభాకర్ పిటిషన్లు దాఖలు చేశారు.
స్పీకర్ చైర్మన్‌గా ఏర్పడిన ట్రిబ్యునల్ ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఇరు పక్షాలకు వాదన వినిపించేందుకు తగిన సమయం, అవకాశాలు ఇచి్చనట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు, శాసనసభ (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత)–1986 నిబంధనల మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు.
ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ విఫలం
తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తప్పుబట్టారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ నిర్ణయాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని కేపీ వివేకానంద అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఏమీ కాదని గతంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ నిర్ణయం బలపరిచేదిగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకలాపాల్లో బహిరంగంగా పాల్గొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ నిర్ణయంపై బీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తాము మరో ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం లేదన్నారు.
స్పీకర్ నోటీసులకు ఇప్పటివరకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరిని వెంటనే అనర్హులుగా ప్రకటించాలని పేర్కొన్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్లను ఏ ప్రాతిపదికన డిస్మిస్ చేశారో వెల్లడించాలని కోరినా స్పీకర్ స్పందించడం లేదన్నారు.
సుప్రీంకోర్టు విధించిన గడువును దృష్టిలో పెట్టుకుని అనర్హత పిటిషన్లపై స్పీకర్ వెలువరించిన నిర్ణయం తూతూ మంత్రంగా ఉందని, దీనిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి అందిన ఆదేశాలనే స్పీకర్ నిర్ణయంగా వెలువరించారని కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటంతోనే తమకు న్యాయం జరుగుతుందని ఆ బీఆర్‌ఎస్ చెబుతోంది.
స్పీకర్ నోటీసులకు కడియం సమాధానం
స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నోటీసులకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను బీఆర్‌ఎస్ పార్టీ సభ్యునిగానే ఉన్నానని, తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని స్పీకర్ ఎదుట అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కేపీ వివేకానందకు అందజేశారు.
కడియం ఇచ్చిన సమాధానాలపై ఈ నెల 19లోగా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని స్పీకర్ గడువు విధించినట్లు సమాచారం. కడియంపై విచారణకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పేందుకు చివరి నిమిషంలో ఆయన సమాధానాన్ని అందజేశారని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
మరో ముగ్గురిపై నేడు నిర్ణయం
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గురువారం నిర్ణయం ప్రకటించే అవకాశముంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, డాక్టర్ సంజయ్ (జగిత్యాల)పై దాఖలైన పిటిషన్లపై విచారణ ఇదివరకే పూర్తయింది. ఈ నేపథ్యంలో గురువారం ఆ ముగ్గురిపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
తదుపరి కార్యాచరణపై బీఆర్‌ఎస్ కసరత్తు
తాము దాఖలు అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం రాత్రి కేటీఆర్‌తో తెలంగాణ భవన్‌లో భేటీ అయి.. స్పీకర్ ఎదుట జరిగిన విచారణ పరిణామాలను వివరించారు.
ఎప్పుడేం జరిగిందంటే..?
– 2023 నవంబర్/డిసెంబర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్‌ఎస్ నుంచి 39 మంది అసెంబ్లీకి ఎన్నిక
– మార్చి–ఏప్రిల్ 2024: బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు. స్పీకర్ వద్ద బీఆర్‌ఎస్ తరపున అనర్హత పిటిషన్లు దాఖలు.
–ఏప్రిల్–జూలై 2024: స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్
–సెప్టెంబర్ 2024: విచారణ షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. కానీ డివిజన్ బెంచ్ దీన్ని సవరించి ‘రీజనబుల్ టైమ్‘లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
– జనవరి 2025: బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
– జూలై 31, 2025: స్పీకర్‌కు సుప్రీంకోర్టు 3 నెలల (అక్టోబర్ 31 వరకు) గడువు ఇచ్చింది.
– సెపె్టంబర్ 29, 2025: విచారణలు మొదలు (మొదటి బ్యాచ్‌లో నలుగురు ఎమ్మెల్యేల విచారణ)
– అక్టోబర్ 2025: క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు, మిగతా ఎమ్మెల్యేల విచారణ.
– అక్టోబర్ 31, 2025: సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసినా నిర్ణయం ప్రకటించని స్పీకర్.
– నవంబర్ 17, 2025: స్పీకర్‌కు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసి, 4 వారాల్లో (డిసెంబర్ 18లోగా) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
– నవంబర్ 20, 2025: 8 మంది ఎమ్మెల్యేలపై విచారణలు పూర్తి.
– డిసెంబర్ 17, 2025: ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాందీపై దాఖలైన అనర్హత పిటిషన్లు కొట్టివేత.


