తెలంగాణ పల్లె ’జంగ్ సైరన్’ మోగించింది
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అన్ని అంశాల్లోనూ మోసగించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు
ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్‌ఎస్సే అని నిరూపించారు
యుద్ధంలో సైనికుల్లా పోరాడిన పార్టీ కార్యకర్తలకు సలాం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని, రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాకతప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల ఆశ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరినీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఏనాటికైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది భారత్ రాష్ట్ర సమితే అని ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారని పేర్కొన్నారు.
సీఎంకు ముచ్చెమటలు..
పంచాయతీ ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘సాధారణంగా పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా అధికార పక్షం వైపు ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని తిరిగినా, మంత్రుల్ని మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడింది.
అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలు గెలవడం చరిత్రలో లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె మోగించిన ‘జంగ్ సైరన్’..’ అని కేటీఆర్ అభివర్ణించారు. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడం, యూరియా కోసం రైతులను లైన్లలో నిలబెట్టడం, పింఛన్ల పెంపులో దగా వంటి అంశాలు అధికార పార్టీపై ప్రజల ఆగ్రహానికి కారణమని చెప్పారు.
ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది
కాంగ్రెస్ అరాచకాలను, అధికార దుర్వినియోగాన్ని, ప్రలోభాలను వీరోచితంగా తట్టుకుని బీఆర్‌ఎస్ వెంట నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ‘ఇది సామాన్య విజయం కాదు.. చరిత్రలో నిలిచిపోయే పోరాటం..’ అని అభివర్ణించారు. ‘యుద్ధంలో సైనికుడిలా పంచాయతీ ఎన్నికల్లో పోరాడిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు శిరస్సువంచి సలాం చేస్తున్నా.
ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రతి గులాబీ సైనికుడి కళ్లల్లో కనిపించిన పౌరుషం పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. అరాచక కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డిని మట్టి కరిపించేందుకు మా శ్రేణులు చేసిన ఈ అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..’ అని ఆయన పేర్కొన్నారు.


