పల్లె పోరులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ
మూడు విడతల్లో కలిపి 7,135 సర్పంచ్ స్థానాల్లో విజయం
3,508 స్థానాల్లో విజయంతో రెండో స్థానంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్
గతం కంటే భారీగా ప్రాతినిధ్యం పెంచుకున్నామనే జోష్‌లో బీజేపీ
మొత్తంగా మూడు పార్టీల్లోనూ ఫలితాలపై సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటరు తీర్పు ఇచ్చాడు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించడం గమనార్హం. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో మూడో వంతు స్థానాల్లో తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించడం.. ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు.
అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియచేస్తోందని విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
1205 పంచాయతీలు ఏకగ్రీవం
రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 12,728 గ్రామపంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగని 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7135 పంచాయతీల్లో విజయం సాధించారు.

ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3508 పంచాయతీల్లో గెలుపొందగా, బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలావుండగా.. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలను ధీటుగా ఎదుర్కొని 1385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు.


