ఈ ఏడాది కృష్ణాలో ఏపీ 533, తెలంగాణ 116 టీఎంసీల వాడకం
ఇక ఏపీ కోటా కింద 82 టీఎంసీలే మిగిలి ఉన్నాయని లెక్కగట్టిన తెలంగాణ
2026 మే 31 వరకు ఆ నీళ్లనే ఏపీ వాడుకునేలా పర్యవేక్షించండి
కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వాడకంలో ఈ ఏడాది సైతం తెలంగాణ తీవ్రంగా వెనకబడింది. ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో ఇప్పటి వరకు ఏపీ ఏకంగా 533.53 టీఎంసీల జలాలను వాడుకోగా, తెలంగాణ 116.9 టీఎంసీలతో సరిపెట్టుకుంది. రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 650.44 టీఎంసీలను వాడుకోగా, అందులో ఏకంగా 82.03 శాతాన్ని ఏపీ వాడుకోగా, 17.97 శాతాన్ని మాత్రమే తెలంగాణ వినియోగించుకుంది.
కనీస నిల్వ మట్టాని (ఎండీడీఎల్)కి ఎగువన శ్రీశైలం జలాశయంలో 146.8 టీఎంసీలు, నాగార్జునసాగర్ జలాశయంలో 152.21 టీఎంసీలు కలిపి మొత్తం 299.02 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ బాధ్యతలను కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్–2కి అప్పగించగా, ఇంకా ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆలోగా ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలను 2015లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. దీనిని 2024–25 నుంచి తెలంగాణ అంగీకరించడం లేదు. ఏపీ, తెలంగాణ మధ్య 29:71 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీ జరపాలని డిమాండ్ చేస్తోంది. 66:34 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకున్నా.. ఇప్పటివరకు చేసిన వాడకం పోగా ఏపీ కోటా కింద 82 టీఎంసీలే మిగిలి ఉంటాయని తాజాగా తెలంగాణ స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది వర్షాలు పడేంతవరకు రావాలి..
2026 మే 31తో ప్రస్తుత నీటి సంవత్సరం ముగియనుండగా, అప్పటివరకు ఏపీకి 142 టీఎంసీల కృష్ణా జలాలు అవసరం కానున్నాయని తెలంగాణ అంచనా వేసింది. 2024 డిసెంబర్ 1 నుంచి 2025 మే 31 వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి మొత్తం 142 టీఎంసీలను ఏపీ వాడుకోవడంతో దాని ఆధారంగా ఈ లెక్కలు వేసింది.
ఏపీ కోటా కింద 82 టీఎంసీలే మిగిలి ఉండటంతో పొదుపుగా అంత మేరకే నీళ్లు వాడుకునేలా ఆ రాష్ట్రానికి సూచనలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ ఇటీవల కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.
ఏపీకి 82 టీఎంసీలపైనే హక్కులుండగా, అదనంగా మరో 60 టీఎంసీల అవసరాలు కలిగి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నీటి వాడకాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షించాలని కోరారు. మళ్లీ జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యే వరకు శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీటి నిల్వలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, లేకుంటే తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడు నుంచే 184 టీఎంసీలు...
పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా 184.61 టీఎంసీలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా 30.11 టీఎంసీలు, చెన్నై తాగునీటి సరఫరాకు కలిపి మొత్తం 218.69 టీఎంసీలను శ్రీశైలం నుంచి ఏపీ వాడుకుంది. కల్వకుర్తి లిఫ్టు అవసరాలకు తెలంగాణ 15.2 టీఎంసీలనే శ్రీశైలం నుంచి వాడుకుంది.
ఇక నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ జలమండలి 8.3 టీఎంసీలు, ఎమ్మార్పీ లిఫ్టు ద్వారా 17.31 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 38.96 టీఎంసీలు కలిపి మొత్తం 64.57 టీఎంసీలను తెలంగాణ వాడుకోగా, సాగర్ ఎడమ కాల్వ ద్వారా 23.47 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 91.98 టీఎంసీలు కలిపి మొత్తం 115.4 టీఎంసీలను ఏపీ వాడుకుంది.
ఇలా మొత్తానికి ఏపీ 533.53 టీఎంసీలు, తెలంగాణ 116.91 టీఎంసీలు వాడుకున్నాయి. ఉమ్మడి జలాశయాల్లో 299.02 టీఎంసీలు, ఇతర జలాశయాల్లో 90.60 టీఎంసీలు కలిపి మొత్తం 389.62 టీఎంసీలు ఎండీడీఎల్‌కి ఎగువన లభ్యతలో ఉన్నాయి.


