బీ ట్యాక్స్ గుప్పెట్లో నరసింహ ఆలయం
ప్రతి టెండర్‌కు ఓ రేటు
తలనీలాల టెండర్‌కు టెండర్
టోల్‌గేట్ బీ ట్యాక్స్ రూ.65 లక్షలు
టెంకాయల వేలంలో రూ.40 లక్షలు
పవిత్ర పుణ్యక్షేత్రంలో గుప్పుమంటున్న సారా
సారా బట్టీల నుంచి నియోజకవర్గ నేతకు మామూళ్లు
అడ్డూఅదుపులేని ప్రజాప్రతినిధి భర్త ఆగడాలు
సాక్షి, నంద్యాల: కోట్లాదిమంది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం నరసింహక్షేత్రం ఇప్పుడు అధికార పార్టీ నేత అక్రమార్జనకు అడ్డాగా మారింది. కొబ్బరికాయ నుంచి తలనీలాలు.. చివరికి పార్కింగ్ నుంచి కూడా బీ ట్యాక్స్ రూపంలో పిండేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధి భర్తకు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. టోల్‌గేట్, తలనీలాల టెండర్, టెంకాయల వేలం పాట, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు.. ఇలా అన్నింటినుంచి ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.
తలనీలాల సేకరణకు ఈ ఏడాది మార్చిలో దేవస్థానం అధికారులు టెండర్ పిలిచారు. చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఒక మహిళ రూ.1.50 కోట్లకు టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ దక్కేలా చేసినందుకు ఆమె బీ ట్యాక్స్ కింద రూ.20 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. టెండర్ దక్కించుకున్న తర్వాత పాట మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు.
మిగిలిన రూ.1.1 కోట్లలో ఆలయానికి వచ్చేదెంతో, బీ ట్యాక్స్‌కు పోయేదెంతో అన్నది చర్చనీయాంశంగా ఉంది. 2024–25కు సంబంధించి తలనీలాల వేలం పాటనే నిర్వహించలేదు. ఏడాది పాటు పోగైన తలనీలాలను ప్రజాప్రతినిధి భర్త కిలో రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయించారు. సుమారు 700 కిలోల మేర తలనీలాల నుంచి రూ.63 లక్షలు కొల్లగొట్టారు.
టోల్‌గేట్‌లో నిలువు దోపిడీ
అహోబిలం ఆలయానికి వచ్చే ట్రాక్టర్లు, కార్లు, టూరిస్ట్ బస్సుల నుంచి పంచాయతీ అధికారులు టోల్ వసూలు చేస్తారు. ఏటా ఇందుకోసం టెండర్ పిలుస్తారు. ఈ ఏడాది జూన్‌లో టోల్‌గేట్‌కు వేలం పాట నిర్వహించారు. టెండర్‌లో వేరే వ్యక్తులు ఎవరూ పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
సొక్కం వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.20.31 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. వేలం పూర్తయిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. కానీ ఇప్పటివరకు ఈ మొత్తాన్ని పంచాయతీకి చెల్లించలేదు. కానీ అతడు బీ ట్యాక్స్ కింద రూ.65 లక్షలు చెల్లించినట్లు సమాచారం. దీంతో రూ.100 వసూలు చేయాల్సినచోట రూ.200 వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
కొబ్బరికాయ రూ.70
ఆలయంలో టెంకాయలు విక్రయించుకునేందుకు అధికారులు గతేడాది టెండర్ పిలిచారు. టెండర్‌లో ఎవరూ పాల్గొనకుండా చేసి రూ.35 లక్షలకు స్థానిక టీడీపీ నేత దక్కించుకున్నాడు. తనకు టెండర్ దక్కేలా చేసినందుకు
బీ ట్యాక్స్ కింద రూ.40 లక్షలు సమర్పించుకున్నాడు. నియోజకవర్గ నేత అండదండలతో ఒక్కో టెంకాయను రూ.70కి విక్రయించి భక్తులను కొల్లగొట్టారు. రూ.35 లక్షలకు టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఆలయానికి రూ.20లక్షలు మాత్రమే జమచేశారు.
సారా బట్టీలు.. బెల్టుషాపులు
అహోబిలానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ కొండల్లో సారా గుప్పుమంటోంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. తాళ్లకుంట కొండల్లో ఆరు, ఏడు బట్టీల్లో సారా కాస్తున్నారు. ఒక్కో బట్టీ నుంచి నియోజకవర్గ నేతకు మామూళ్లు వెళుతున్నాయి. సారాతో పాటు 8 మద్యం బెల్ట్ షాప్‌లు వెలిశాయి. పోతురాజు చెరువు, ఛత్రవట గుట్టల కింద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 కమీషన్ వసూలు చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి సహజ సంపదను కొల్లగొడుతున్నా అధికారులు స్పందించడం లేదు.


