గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం
ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా తీర్చిదిద్దుతూ మరింత సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు వాటి పేరును ‘స్వర్ణ గ్రామం’గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు బాగుండటం లేదని, హాజరు 74 శాతం దాటడం లేదని, పనితీరు మార్చుకోకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమంటూ హెచ్చరించారు.
వాట్సాప్ సేవల్లో సెక్యూరిటీ ఉండదని వినియోగించుకోవడానికి వెనుకాడుతున్నారని, మరికొంతమంది స్మార్ట్ ఫోన్ లేదని, ఎలా వినియోగించుకోవాలో అర్థం కావడం లేదంటున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించడం ద్వారా వాట్సాప్ సేవలను విరివిగా వాడుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
» మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ త్వరితగతిన పూర్తి చేసి 4 జీ టవర్ల ఏర్పాటుకు కలెక్టర్లు సహకరించాల్సిందిగా సీఎం సూచించారు. జిల్లాల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఫైలు ఇకపై ఈ–ఫైల్‌గానే నిర్వహించాలని, జనవరి 15వతేదీ తర్వాత ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిసారి సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఇప్పటికే రూ.2,847 కోట్ల పెట్టుబడులకు 29 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు.
రాష్ట్రంలో ఏటా 5 వేల మందికి క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 538కిపైగా ఎంవోయూలు గ్రౌండ్ అయ్యే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులకు నెల రోజుల్లోగా శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


