రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఎటువంటి రాజకీయ అజెండా లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన సంఘ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంఘ్ గమ్యాలను బీజేపీ దృష్టికోణంతో చూస్తున్నారని ఇది చాలా తప్పని మోహన్ భగవత్ హెచ్చరించారు.
ప్రస్తుతం కాషాయపార్టీ హవా దేశవ్యాప్తంగా నడుస్తోంది. వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయడంతో పాటు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే చాలా మంది బీజేపీకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందంటుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండింటి భావజాలాలు దాదాపు ఒకటే అని అంటుంటారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.
స్వయంసేవక్ సంఘ్ భావనలను సంకుచిత భావజాలంతో చూడడం చాలా తప్పని మోహన్ భగవత్ అన్నారు. "చాలా మంది బీజేపీ దృష్టితో సంఘ్‌ని చూస్తారు. ఇది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్‌కు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం హిందూ సమాజం రక్షణ అభివృద్ధి కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది". అని ఆయన తెలిపారు. సంఘ్ ప్రజలను ఉన్నతమైన వ్యక్తులుగా మారేలా చేస్తోందని వారిలో నైతిక విలువలు పెంపోందించేలా శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. తద్వారా వారు భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని అన్నారు.
సంఘ్ కార్యకలాపాలన్ని దేశం బాగు కోసం హిందు సమాజ రక్షణ కోసం ఉంటాయి. అయితే చాలా మంది సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా భావిస్తారని కాని అది అవాస్తవమని తెలిపారు. భారత్ మరోసారి విశ్వగురుగా మారుతుందని ఆ విధంగా సమాజాన్ని రూపొందించడం ఆర్ఎస్ఎస్ బాధ్యతని మోహన్ భగవత్ పేర్కొన్నారు.


