సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం రద్దయింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదని క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారంతో రాష్ట్ర బీజేపీ ఈ ప్రచారయత్నాలను విరమించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుతో జనసేన పార్టీ స్థానికనేతలు సమావేశమైనప్పుడు ఈ అభిప్రాయం వచ్చినట్లు తెలిసింది.
ఏపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులను నిలపడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ రెబెల్ అభ్యర్థికి జనసేన తరఫున బీఫామ్ ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చే పవన్ కల్యాణ్ బీజేపీకి ఓటేయమంటారా లేక జనసేనకు ఓటేయమంటారా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రచారంలో జనసేన పార్టీ జెండాలు కూడా ప్రదర్శిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో శనివారం నుంచి వికారాబాద్, తాండూరు, నల్లగొండ తదితర చోట్ల నిర్వహించాలని భావించిన పవన్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. పైకి మాత్రం అనారోగ్య కారణాలు చూపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంటూ బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి పోటీచేసిన 8 చోట్లా డిపాజిట్ గల్లంతు కావడాన్ని గుర్తుచేస్తున్నారు.


