భారత్‌ అణు పరీక్షలు?.. పాక్‌కు దబిడి దిబిడే! | Nuclear opportunity for India? | Sakshi
Sakshi News home page

భారత్‌ అణు పరీక్షలు?.. పాక్‌కు దబిడి దిబిడే!

Nov 5 2025 10:07 AM | Updated on Nov 5 2025 12:46 PM

Nuclear opportunity for India?

అణు పరీక్షలపై అమెరికా నిర్ణయం దరిమిలా..

భూగర్భంలో అణు పేలుళ్లకు సన్నాహాలు

1998లో పోఖ్రాణ్‌లో ఐదు అణు పేలుళ్లు

అణు శక్తి కలిగిన దేశాల జాబితాలో భారత్‌

సామర్థ్యాన్ని పెంచనున్న థర్మో న్యూక్లియర్ బాంబులు

ప్రపంచం మళ్లీ అణు యుగం అంచున నిలబడి ఉంది. మూడు దశాబ్దాల సైలెన్స్ తర్వాత.. అణు పరీక్షల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా మళ్లీ అణు పరీక్షలు చేయబోతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. 1992 తర్వాత మొదటిసారి అమెరికా తన భూగర్భంలో అణు పేలుళ్లకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం కేవలం ఒక పరీక్ష కాదు.. ఇది వరల్డ్‌ న్యూక్లియర్‌ బ్యాలెన్స్‌ను కదిలించే సంకేతం. ఈ ప్రకటనతో ప్రపంచ శక్తుల మధ్య ఒక కొత్త పోటీ మొదలైంది. రష్యా ఇప్పటికే సముద్రం అడుగున అణు శక్తితో నడిచే డ్రోన్‌ను పరీక్షించింది. చైనా తన కొత్త ఆర్బిట్‌ బాంబుల వ్యవస్థను ప్రదర్శించింది. ఇలా అణు శబ్దం ప్రపంచాన్ని మళ్లీ చుట్టేసిందనే చెప్పాలి. ఇక ఈ పరిణామాల మధ్య ఒక ప్రశ్న మెల్లగా భారత్ వైపు తిరుగుతోంది. పోఖ్రాణ్ ఎడారిలో ఎన్నో ఏళ్ల క్రితం జరిపిన అణు పేలుళ్ల తర్వాత భారత్ స్వచ్ఛందంగా పరీక్షలను ఆపింది. కానీ ఇప్పుడు ప్రపంచం మళ్లీ అణు బీభత్సం దిశగా వెళ్తుంటే, భారత్ కూడా తన పాత శక్తిని మళ్లీ నిరూపించుకోవాలా అనే ఆలోచనలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

పొరుగు దేశాల బాటలో..
నిజానికి భారత్‌ సరిహద్దుల్లో రెండు అణు నీడలు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అమెరికా సాయంతో బాంబులను పెంచుకుంటోంది. చైనా భారీ హైడ్రోజన్ బాంబులతో ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్‌కు ఒక అవకాశమా, లేక ప్రమాదమా అనే ప్రశ్న వినిపిస్తోంది. 1998లో పోఖ్రాణ్ ఇసుకల కింద జరిగిన ఆ ఐదు అణు పేలుళ్లు ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాయి. ఇక భారత్ అణు శక్తి ఉన్న దేశాల జాబితాలో చేరింది. కానీ ఆ విజయం వెంటనే ఒక వివాదం మొదలైంది. హైడ్రోజన్ బాంబు పరీక్ష పూర్తిగా సక్సెస్ కాలేదని DRDO శాస్త్రవేత్త సంతానం ప్రకటించారు. ప్రయోగించిన బాంబు దాదాపు 10 నుంచి 15 కిలోటన్నుల శక్తిని మాత్రమే విడుదల చేసిందని చెప్పారు. కానీ అప్పటి అణు విభాగం చైర్మన్ రాజగోపాల చిదంబరం మాత్రం ఈ పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని చెప్పడం వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ప్రపంచంలోని భూకంప కేంద్రాలు పంపిన సైజ్మిక్ డేటా కూడా అనేక అనుమానాలు రేపింది. అధికారికంగా భారత్ ప్రకటించిన 58 కిలోటన్నుల శక్తి కంటే చాలా తక్కువ శక్తి గుర్తించబడింది. ఈ వాదనలతో పోఖ్రాణ్ పరీక్ష ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడా మిస్టరీ గురించి చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇండియా దగ్గర 180 వార్‌హెడ్లు?
ఇటు ట్రంప్ కొత్త అణు పరీక్ష సందేశాలతో ప్రపంచం మారుతోంది. రష్యా కొత్త అణు శక్తి యంత్రాలను పరీక్షిస్తుండగా.. చైనా అంతరిక్షం నుంచి దాడి చేయగల FOBS వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్ తన చిన్న టాక్టికల్ బాంబులను పెంచుకుంటోంది. దీంతో ఇండియా కూడా ఈవైపుగా అడుగులు వెయ్యాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండియా దగ్గర అణు నిల్వలు దాదాపు 180 వార్‌హెడ్లు ఉన్నట్లు అంచనా. పాకిస్తాన్ దాదాపు 170కి చేరింది. చైనా దగ్గర ఇప్పటికే 600కి పైగా ఉండగా.. 2030 నాటికి ఈ సంఖ్య వెయ్యికి చేరవచ్చని అంచనా. ఈ నంబర్‌ గేమ్‌ మధ్య భారత్ తన అణు వ్యూహాన్ని కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటు మళ్లీ అణు పరీక్షలు చేయడం ద్వారా భారత్ తన థర్మో న్యూక్లియర్ బాంబులను పూర్తిగా ధృవీకరించుకోవచ్చు. ఈ పరీక్షలు భారత్ సామర్థ్యాన్ని పెంచుతాయని.. నో ఫస్ట్ యూజ్ విధానాన్ని మరింత బలపరుస్తాయని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయంగా ప్రమాదకరం?
అయితే మరికొందరు శాస్త్రవేత్తల మాట వేరేలా ఉంది. కొత్త పరీక్షలు అవసరం లేవని కొందరు సైంటిస్టులు అంటున్నారు. 1998లో సేకరించిన డేటా, కంప్యూటర్ సిమ్యులేషన్లు చాలని వారు నమ్ముతున్నారు. కొత్త పరీక్షలు భారత్‌కి అంతర్జాతీయంగా ప్రమాదకరమని, అమెరికాతో ఉన్న అణు ఒప్పందం కూడా ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇప్పటికీ CTBT ఒప్పందాన్ని ఆమోదించలేదు. చైనా కూడా ఆ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు. భారత్, పాకిస్తాన్ కూడా దానిపై సంతకం చేయలేదు. ఇటు ఒప్పందాన్ని ముందుగా అంగీకరించిన రష్యా తన మద్దతును వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ అణు నియంత్రణ వ్యవస్థ బలహీనపడుతోంది. ఒకవేళ అమెరికా పరీక్షలు మొదలుపెడితే.. రష్యా, చైనా కూడా అదే పని చేస్తాయి. అప్పుడు భారత్ మౌనం పాటిస్తే, వ్యూహాత్మకంగా వెనుకబడే అవకాశం ఉంది.

కొత్త యుగానికి ఆరంభం
ఈ పరిస్థితుల్లో భారత్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి.. తన సైలెన్స్‌ను కొనసాగిస్తూ.. డిప్లమసీ ద్వారా శాంతిని కాపాడటం. ఇంకొకటి, ఈ కొత్త ప్రపంచ అణు పోటీని ఉపయోగించి, తన అణు శక్తిని తిరిగి నిరూపించుకోవడం. ఇందులో భారత్‌ ఏం చేస్తుందో ఇప్పటికైతే చెప్పలేం కానీ.. ఎడారి రాత్రి నిశ్శబ్దంలో మాత్రం ఎక్కడో గాలి కదిలినట్టు ఉంది. ప్రపంచం మొత్తం ఒక నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అమెరికా, రష్యా, చైనా తమ సన్నాహాల్లో బిజీగా ఉండగా.. భారత్‌కు తన సొంత లెక్కలున్నాయని అర్థమవుతోంది. ఒకవేళ ఈ సారి పోఖ్రాణ్ మళ్లీ ప్రకంపన రేపితే.. అది కేవలం ఒక పరీక్ష కాదు, అది కొత్త యుగానికి ఆరంభం అవుతుంది. అణు బాంబు శబ్దం మళ్లీ వినిపిస్తే, అది చరిత్రలో మరో సారి ప్రపంచాన్ని మార్చే క్షణం అవుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. ఒక సంకేతం...! ఆ సంకేతం భారత్‌కు భవిష్యత్తును నిర్ణయించే పిలుపు కావచ్చు.. కాకపోవచ్చు కూడా.. నిర్ణయమంత కేంద్ర పెద్దల చేతుల్లోనే ఉందండి..!

ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్‌జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement