ఫిర్యాదు అందలేదన్న ఢిల్లీ పోలీసులు
తక్షణమే అతడిని తొలగించామన్న ఎయిరిండియా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ పాయింట్ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టులోని టెరి్మనల్–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్‌కు గురైందని అంకిత్ పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


