2 నిమిషాల వినోదం | Micro dramas are gaining more viewers | Sakshi
Sakshi News home page

2 నిమిషాల వినోదం

Dec 20 2025 4:26 AM | Updated on Dec 20 2025 4:26 AM

Micro dramas are gaining more viewers

మైక్రోడ్రామాలకు పెరుగుతున్న వ్యూయర్స్‌ 

భారత్‌లో 10 కోట్లకు చేరిన వీక్షకులు 

అమెజాన్, జీ గ్రూప్‌ సైతం ఈ రంగంలోకి.. 

మైక్రో డ్రామా.. భారత్‌లో ఇటీవలి కాలంలో ‘తెర’పైకి వచ్చిన నూతన వినోద సాధనం. మొబైల్‌ ఫోన్‌లో వీక్షించేందుకు వీలుగా రూపొందుతున్న ఈ 1–2 నిమిషాల చిన్న వీడియోలు ఇప్పుడు మన దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కామెడీ, క్రైమ్, రొమాన్స్, రివెంజ్, ఫాంటసీ.. జానర్‌ ఏదైనా రీల్స్, షార్ట్స్‌ స్థానాన్ని మైక్రో డ్రామాలు భర్తీ చేస్తున్నాయి.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌.. వేదిక ఏదైనా ప్రపంచవ్యాప్తంగా యూజర్ల వీక్షణ తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. మొబైల్‌ తెరపై గంటల కొద్దీ ఒకే వీడియోను చూడటం పాత కాలం. జెన్‌ ఆల్ఫా, జెన్‌–జీ, మిలీనియల్స్, జెన్‌–ఎక్స్‌.. తరం ఏదైనా స్క్రీన్‌ను వేగంగా స్క్రోల్‌ చేస్తున్నారు. అంటే స్క్రీన్‌పై ఉన్న వీడియోను తక్కువ సమయంలోనే స్క్రోల్‌ చేసి మరో వీడియోను చూస్తున్నారు. 

ఇటువంటి వారి కోసమే రీల్స్, షార్ట్స్‌ మాదిరిగా మైక్రోడ్రామా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో మొదలైన మైక్రో డ్రామా ఫీవర్‌ మన దేశానికీ పాకింది. భారత్‌లో మైక్రో డ్రామా వ్యూయర్స్‌ సంఖ్య 10 కోట్లు ఉన్నట్టు అంచనా. ఆర్మాక్స్‌ మీడియా ప్రకారం వీరిలో 55 శాతానికిపైగా వీక్షకులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం.  

దిగ్గజ సంస్థలూ ఎంట్రీ..: మెలో డ్రామా, కొరియన్‌ డ్రామాలు చాలాకాలంగా భారతీయుల వినోదంలో భాగమయ్యాయి. ఇప్పుడు మైక్రో డ్రామాల వంతు వచ్చింది. సిరీస్‌లోని అన్ని ఎపిసోడ్స్‌నూ వీక్షించేంతగా ఈ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంకేముంది డబ్బులు చెల్లించి మరీ జనం ఆస్వాదిస్తున్నారు. 

మైక్రోడ్రామాలను ప్రసారం చేసేందుకు మన దేశంలో ప్రత్యేక యాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయంటే వీటికి ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. పైగా అమెజాన్, జీ గ్రూప్‌ వంటి దిగ్గజాలూ ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. మైక్రో డ్రామాల చిత్రీకరణకు తక్కువ వ్యయం అవుతుంది. వీటితో కంటెంట్‌ క్రియేటర్లకు ఆదాయాలు మెరుగ్గా ఉంటాయి. 

బాక్సాఫీస్‌ను దాటి..: అతి తక్కువ నిడివితో, సీరియళ్ల రూపంలో వీడియో కథనాలు కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో చైనాలో డ్వాంజూగా ఉద్భవించాయి. ప్రస్తుతం ఇవి చైనా బాక్సాఫీస్‌ కలెక్షన్లను దాటడం ఆశ్చర్యం కలిగించే అంశం. చైనాలో 66 కోట్ల మంది ఈ మైక్రో వీడియోలను వీక్షిస్తున్నట్టు సమాచారం. ఈ విభాగం ఆ దేశ వినోద పరిశ్రమకు ఏటా 7 బిలియన్‌ డాలర్ల కాసులు కురిపిస్తోంది.  

ఇంటర్నెట్‌ వినోదం.. 31.3 కోట్లు  
కేవలం ఇంటర్నెట్‌ ఆధారిత వినోదం ఆస్వాదిస్తున్న వీక్షకుల సంఖ్య మన దేశంలో 31.3 కోట్లు ఉన్నట్టు అంచనా. వీరిలో నాలుగింట మూడు వంతులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం. కేబుల్, శాటిలైట్, ఓవర్‌ ద ఎయిర్‌ ద్వారా ప్రసారమయ్యే సంప్రదాయ టీవీ వీక్షణానికి వీరు దూరం. గత ఏడాదితో పోలిస్తే డిజిటల్‌ ఆడియెన్స్‌ సంఖ్య 30 శాతం పెరిగిందని కాంటార్‌ తన మీడియా కాంపాస్‌ నివేదికలో వెల్లడించింది.  

అవీ ఇవీ...
» చైనా తరువాత మైక్రో డ్రామా వీక్షకుల సంఖ్యలో అమెరికా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, జపాన్‌ పోటీపడుతున్నాయి. ఆరో స్థానంలో భారత్‌ నిలిచింది.  
» 2030 నాటికి మైక్రో డ్రామా పరిశ్రమ వార్షిక విలువ భారత్‌లో 5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 
» 18–35 ఏళ్ల వయసున్నవారు అత్యధికంగా మైక్రో డ్రామాలను వీక్షిస్తున్నట్లు జీ గ్రూప్‌ కంపెనీ బులెటిన్‌ చెబుతోంది. 
» సంప్రదాయ ఓటీటీ షోలతో పోలిస్తే మైక్రోడ్రామాల రూపకల్పనకు సమయం 80% ఆదా అవుతుందన్నది నిపుణుల మాట.  
» భారత్‌లో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రోజుకు సగటున 5 నుంచి 7.4 గంటలు మొబైల్‌లో గడుపుతున్నారు. సింహభాగం వాటా వీడియోలదే. 
» ఈక్విటీ పరిశోధన, బ్రోకింగ్‌ సంస్థ బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ ప్రకారం.. భారత్‌లో ద్వితీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లు నెలకు 35–40 జీబీ ఇంటర్నెట్‌ డేటాను ఉపయోగిస్తున్నారు. ఇది మెట్రో నగరాల్లోని వినియోగదారుల కంటే 30 శాతం ఎక్కువ. 86% భారతీయులు మైక్రోడ్రామాలతోసహా ఓటీటీలో కంటెంట్‌ కోసం మొబైల్‌ డేటా వాడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement