పల్లెల్లో స్వతంత్ర పారిశుధ్య పథకాన్ని అమలు చేయాలి
పేద రాష్ట్రాలకు అదనంగా ఆర్ధిక సాయం అందించాలి
ఇందుకోసం క్లీన్ విలేజ్ ఫండ్ ఏర్పాటు చేయాలి
కేంద్రానికి పంచాయతీరాజ్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, సమృధ్ధిగా తాగునీరు, ఆహార భద్రత అందించే లక్ష్యంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తీసు కొచ్చిన ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను చూసే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడంతో పాటు సామాజిక, ఆర్ధిక వృద్ధికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేంద్రం ఎటువంటి పథకాన్ని అమలు చేయనందున కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు అమలవుతున్నా యని తెలిపింది. నిధుల లేమి కారణంగా కొన్ని రాష్ట్రాలు దీనిని పక్కనబెట్టాయంది. ఇటువంటి రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం అందించాల్సిన అవసరముందని సూచించింది.
నిధులు, శిక్షణ, అవగాహన కీలకం
లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలకా నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ఇటీవలి శీతాకాల సమావేశాల్లో తన 23వ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద ఎన్నికైన ప్రతినిధులు, సంబంధీకులు, పంచాయతీ కార్యకర్తలకు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‌పై సవివర ప్రణాళికలను సిద్ధం చేయడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శిక్షణ అందించిందని నివేదిక గుర్తు చేసింది. ఈ శిక్షణతో 99వేల పంచాయతీలు ఈ కార్యక్రమంపై అవగాహ న ఏర్పడిందని తెలిపింది.
గ్రామాల్లో సామా జిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసే సామర్థ్యం ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్‘కు ఉన్నప్ప టికీ అమలులో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. కేంద్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నిధులను అందించని కార ణంగా దేశవ్యాప్తంగా అమలు పురోగతి ఏకరీ తిన లేని విషయాన్ని గుర్తించినట్లు పార్లమెంటరీ కమిటీ తెలిపింది.
క్షేత్రస్థాయిలో తగు శిక్షణ అందిస్తున్నా, అమలు విషయంలో సమస్యలు ఎదురవుతున్నారని, ముఖ్యంగా స్థానికుల ప్రమేయం చాలా తక్కువగా ఉంటోందని గుర్తించింది. గ్రామాల్లో స్వచ్ఛభా రత్ మిషన్ కొనసాగుతున్నా.. వ్యర్థాల నిర్వ హణ, కంపోస్టింగ్ మౌలిక సదుపాయాలు, చిన్న తరహా నీటి సంరక్షణ కార్యక్రమాలు వంటి పర్యావరణ సంబంధిత పనుల అమలుకు పంచాయతీలు ఆర్థిక వనరులతో సన్నద్ధంగా లేవని కమిటీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో పలు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. ‘క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’అమలులో సమానత్వాన్ని కొనసాగించేందుకు, పేద రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వీలుగా తగిన నిధులు, స్పష్టమైన మార్గదర్శకాలతో కేంద్ర పంచాయతీరాజ శాఖ స్వతంత్ర పారిశుధ్య పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, స్థానికులు చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించడానికి ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది.
ఇంటింటి ప్రచారం, వాల్ ఆర్ట్, టాయిలెట్ల పరిశుభ్రతపై స్థానిక జానపద మీడియా వినియోగం, గృహాలు, బహిరంగ ప్రదేశాలు, సంస్థలలో చెత్తబుట్టల వాడకం వంటి భారీ కార్యకలాపాలకు వీలుగా పూర్తిస్థాయి ‘క్లీన్ విలేజ్ ఫండ్‘ను ఏర్పాటు చేయాలని సూచించింది. నిర్మించిన మరుగుదొడ్ల వినియోగాన్ని పర్యవేక్షించే చర్యలు చేపడట్టడంతో పాటు పురోగతిని ట్రాక్ చేయడానికి, అంతరాలను గుర్తించేందుకు ఈ–గ్రామ్‌స్వరాజ్‌తో పారిశుధ్య డాష్‌బోర్డ్‌ను అనుసంధానించాలని తెలిపింది. వంటింట్లో స్వచ్ఛ ఇంధనం ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు స్వయం సహాయక సంఘాల సేవలను వాడుకోవా లని కమిటీ సిఫార్సు చేసింది.


