నివాళి
చెట్టు అంటే ఏమిటి? అది ప్రాణవాయువు. అది ఆకు కొమ్మ ఫలం. అది పువ్వు. అది నీడ. అది గూడు. అది గుర్తు. చెట్టు బతికితే మనిషి బతుకుతాడు. జీవితాంతం చెట్లు నాటుతూ బతికిన సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్ను మూశారు. పచ్చటి సందేశమై ఆమె మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తూనే ఉంటారు.
వృక్షో రక్షతి రక్షితః... ఇది కొందరికి ఒట్టి వేదవాక్కు. కాని ‘సాలుమరద’ తిమ్మక్కకు అది జీవనవేదం. చెట్లను తన బిడ్డలుగా భావించి, వాటిని పెంచి పోషించిన ఆ చెట్ల అవ్వ ఇక లేరు. సాలుమరద అంటే చెట్ల వరుస అని కన్నడంలో అర్థం. ప్రజలు ఇచ్చిన ఇంటి పేరును తన పేరులో కలుపుకున్న కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. అల్లారుముద్దుగా తమను పెంచిన ఆ తల్లి తరలిపోగా వృక్షాలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి.
ఆ వనంలాంటి రోడ్డు
కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కూడూర్–హలికల్ మధ్యనున్న స్టేట్ హైవే నం.94లో ఉన్న మర్రిచెట్లను ఓమారు పలకరించండి. 4.5 కిలోమీటర్ల దూరం వరకూ ఆ రోడ్డుకు అటూ ఇటూ భారీగా ఎదిగిన ప్రతిచెట్టు తమ బతుకు వెనుక తిమ్మక్క ఉందని చెప్తుంది. ఎన్నో విషయాలు వివరిస్తుంది. నీరు దొరకడమే గగనమైన ఆనాటి రోజుల్లో ఒక్కో మొక్కకు నీరు పోసి, పెంచి, బాగోగులు చూసి వాటిని కంటికి రెప్పలా కాపాడిన తిమ్మక్క, చిక్కయ్య దంపతుల గొప్పతనం అక్కడున్న ప్రతి చెట్టు తెలియజేస్తుంది. మొత్తం 385 మర్రిచెట్లను నాటి, వాటిని పెంచి, ఆ ప్రాంతంలో పచ్చదనం నెలకొల్పిన ఘనత తిమ్మక్కదే.
బిడ్డలులేని ఆమె చెట్టునే బిడ్డ అనుకుంది. అయితే ఒకరిద్దరితో ఆ సంతానాన్ని నియంత్రించలేదు. మొక్కలు నాటడాన్ని ఆపలేదు. తాను జీవించి ఉన్నంత కాలం మొక్కలు నాటుతూ పంచుతూ పెంచుతూ ఉండిపోయింది. అందుకే 2019లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లను కొట్టేయాలని యోచించినప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి తిమ్మక్క లేఖ రాశారు. 70 ఏళ్ల వయసున్న ఆ వృక్షాలను రక్షించాలని కోరారు. ఆమె మాటతో ముఖ్యమంత్రి ఆ చెట్ల కొట్టివేతను ఆపి, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా తిమ్మక్క వల్లే సాధ్యమైంది.
ప్రపంచమంతా మెచ్చుకోలు
తిమ్మక్క దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా దేశవిదేశాల్లో అనేకమంది ఆమె కృషిని గుర్తించినా 2016లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంత మహిళల జాబితాలో బీబీసీ ఆమె పేరును పేర్కొన్నా మన దేశం మాత్రం తిమ్మక్కను గుర్తించడంలో చాలా ఆలస్యం చేసిందని ఆమె గురించి తెలిసినవారు అంటారు. 108 ఏళ్ల వయసులో ఆమెకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అది చాలా ఆలస్యమని, అయినా ఆమెకు తన పని మీద తప్ప ఇటువంటి వాటి మీద ఆసక్తి లేదని ఆమె అభిమానుల మాట. ఆ తర్వాతే దేశంలోని అనేకమందికి తిమ్మక్క గురించి తెలిసింది. ఆమె వివరాలు, ఆమె చేస్తున్న పని ప్రాచుర్యం పొందాయి. కాలిఫోర్నియాలో పర్యావరణం మీద పని చేసే ఒక ఎన్.జి.ఓ తన సెంటర్‌కు సాలుమరద తిమ్మక్క పేరు పెట్టింది.
చెట్లే ఆరోగ్యం
తిమ్మక్క జీవితం చూస్తే చెట్లే ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాయా అనిపిస్తుంది. సగటు మనుషులు 50 దాటక ముందే అనారోగ్యం బారిన పడుతున్న వేళ తిమ్మక్క వందేళ్లు దాటాక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ఖాళీగా కూర్చోవడం, దిగులుతో బాధపడటం ఆమెకు తెలియదు. 1991లో భర్త మరణించిన తర్వాత అన్ని పనులూ భుజాన వేసుకున్నారు. చెట్లు నాటడమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు.
2020లో నడుముకు సంబంధించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతంగా జరిగిందని, తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యం బారిన పడ్డ ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో నవంబర్ 14న కన్నుమూశారు. ఆమెకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. తిమ్మక్క శివైక్యం చెందారు. ఆమె నాటిన చెట్లు కలకాలం పచ్చగా ఆమెను గుర్తు చేస్తుంటాయి.


