మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి(90) కన్నుమూశారు. గతకొంత కాలంగా పక్షవాతం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
శాంతి కుమారి భర్త, మాజీ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథన్ నాయర్ 2005లో మరణించారు. వారి పెద్ద కుమారుడు ప్యారేలాల్ కూడా 2000లో మృతిచెందారు.
మోహన్‌లాల్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తర్వాత కూడా ముందుగా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్‌లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని తెలిపారు.
శాంతకుమారి మరణవార్త విని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. మమ్ముట్టి దంపతులు మోహన్‌లాల్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.


