భర్త శ్రీనివాసన్ కన్నుమూత
కోజికోడ్: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. తమ నివాసంలో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీనివాసన్‌ను సన్నిహితులు ఆస్పత్రికి తీసుకెళ్లినా... అప్పటికే ఆయన మరణించారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడు అయిన శ్రీనివాసన్ సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైరయ్యారు.
ఉష కెరీర్‌లో అన్ని విధాలా సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో పాటు ఆమె పురోగతిలో భర్త కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో ఉష రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు దూరమైన తర్వాత మళ్లీ 1998 ఆసియా చాంపియన్‌షిప్ ద్వారా ఆమె ట్రాక్‌పైకి పునరాగమనం చేసేందుకు శ్రీనివాసన్ అండగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ నిర్వహణా వ్యవహారాలు చూస్తున్నారు. వీరిద్దరికి ‘ఉజ్వల్’ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఉషతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమె భర్త మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.


