సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.
కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్‌ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.
గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.


