ముగిసిన ఆయేషా మీరా అవశేషాల అంత్యక్రియలు
పటిష్ట భద్రత నడుమ విజయవాడ నుంచి తీసుకువచ్చిన సీబీఐ బృందం సీబీఐ, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఖననం
తెనాలిరూరల్: తెనాలికి చెందిన ఆయేషామీరా హత్య కేసును మూసివేసిన సీబీఐ కోర్టు దర్యాప్తు కోసం తన దగ్గరున్న ఆమె అవశేషాలను శుక్రవారం విజయవాడలో తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం అవశేషాలను తెనాలిలోని ఈద్గాలో గల ఆయేషా మీరా సమాధిలో అంత్యక్రియలు చేశారు. కార్యక్రమంలో వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. అవశేషాలు తీసుకువస్తున్న కాన్వాయ్‌ను వీఎస్సార్ కళాశాల వద్ద నుంచి తోడ్కొని ఈద్గా మైదానానికి తీసుకువచ్చి వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆమె మృతదేహానికి 2019లో రెండో సారి పోస్టుమార్టం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెనాలి చెంచుపేటలోని కబరస్తాన్‌లోని ఆయేషా సమాధిని తవ్వించి, కేసు దర్యాప్తుకు అవసరమవుతాయన్న భావనతో కింది దవడ ఎముక, ఉరోస్థి(స్టెర్నమ్), మోచేతి పైఎముక(హుమెరస్), పుర్రె ఎముకలను సేకరించి సీల్డు కవర్లు, బాక్సుల్లో భద్రపరచి, పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్)కి అప్పట్లో తరలించారు. హైదరాబాద్ గాంధీ వైద్యశాల ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు. అనంతరం ఈనెల 20న కేసును మూసివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దర్యాప్తు అధికారి, మృతురాలి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. ఆ ప్రకారం విజయవాడలోని సీబీఐ కోర్టుకు వెళ్లిన ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషద్ బేగం, ఇక్బాల్ బాషాలకు వారి కుమార్తె అవశేషాలను అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారుల బృందం భారీ భద్రత నడుమ తెనాలికి తరలించారు. వీఎస్సార్ కాలేజి దగ్గర నుండి ప్రజలు, ఆయేషా బంధువులు, ముస్లింలు ర్యాలీగా అవశేషాలను చెంచుపేటలోని ఈద్గా మైదానానికి తీసుకువచ్చారు. ముస్లింల ఆచారం ప్రకారం మత పెద్దలు దువా నిర్వహించిన అనంతరం కబరస్తాన్‌లో అప్పటికే తవ్వించి ఉంచిన ఆయేషా సమాధిలో అవశేషాలను సీబీఐ, రెవిన్యూ అధికారుల సమక్షంలో ఖననం చేశారు. దారి పొడవునా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు బందోబస్తును పర్యవేక్షించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పంచనామా నిర్వహించారు.
మేం బతికుండగా ఆయేషా కేసు ముగియదు..
ఆయేషా అవశేషాలను ఖననం చేసిన అనంతరం ఆమె తండ్రి ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడారు. ఆయేషా కేసు ముగిసిందంటున్నారని, తల్లిదండ్రులమైన తాము బతికి ఉన్నంత వరకు కేసు ముగియదన్నారు. ఆయేషాకు సీబీఐ, సిట్ అధికారులు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసులో ఆధారాలు లేవంటున్నారని, దర్యాప్తు చేసిన అధికారులే ఆధారాలన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. త్వరలో సీఎం చంద్రబాబునాయుడును కలుస్తామని, ఆయన ఇచ్చిన హామీ మేరకు తమకు న్యాయం చేయాలన్నారు. నిందితులకు శిక్ష పడినప్పుడే ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలుగుదుందని స్పష్టం చేశారు.


