బెంగాల్‌ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు | Bengal Elections Abhishek Banerjee Spearheads TMC's Aggressive Charge | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు

Apr 14 2026 7:37 AM | Updated on Apr 14 2026 9:00 AM

Bengal Elections Abhishek Banerjee Spearheads TMC's Aggressive Charge

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారంలో కేంద్ర బిందువుగా మారిన యువ నేత, కీలక వ్యూహకర్త అభిషేక్ బెనర్జీ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పదునైన విమర్శలు, ప్రతిపక్షాలపై సూటి ప్రశ్నలు, క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో ఆయన తన ప్రచార శైలికి మరింత పదునుపెట్టారు. ఒకవైపు ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు బెంగాల్ రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారాయి.

ఈసీ తీరుపై సంచలన ఆరోపణలు
వరుస ప్రజా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న అభిషేక్ బెనర్జీ.. ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల తటస్థతపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం (ఈసీ) తీరు పక్షపాతంగా మారిందని, ఎన్నికల ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు లేకుండా పోయాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతూనే, టీఎంసీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మరింత భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని అభిషేక్ బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.

‘ప్రతిపక్షాలది అపవిత్ర కలయిక’
రెజీనగర్‌లో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఏజేయూపీ, ఐఎస్ఎఫ్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కేవలం అవకాశవాదంతో ఏకమయ్యాయని, అదొక అపవిత్ర కలయిక అని ఆయన అభివర్ణించారు. వివిధ పార్టీలకు చెందిన కుళ్టిన మూలకాలను కలపడం వల్ల రాష్ట్రంలో కేవలం అస్థిరత మాత్రమే ఏర్పడుతుందని, ఆ కూటమికి ఎలాంటి సైద్ధాంతిక నిబద్ధత లేదని విమర్శించారు. ఇదే క్రమంలో, ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్‌కు సంబంధించిన వివాదాస్పద వైరల్ వీడియో వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. పలు పార్టీల సీనియర్ నేతలు, కేంద్ర సంస్థల ప్రమేయంతో భారీ స్థాయిలో రాజకీయ డీల్ జరిగినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోందని ఆరోపించి బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.

క్షేత్రస్థాయి వ్యూహాలు.. భవిష్యత్ నాయకత్వం
కేవలం మాటలకే పరిమితం కాకుండా, అభిషేక్ బెనర్జీ జిల్లాల స్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారు. పౌరసత్వం తదితర కీలక అంశాలపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ‘జాతీయ పౌర పట్టిక’(ఎన్‌ఆర్‌సీ) అమలును బెంగాల్ ఎంత కఠినంగా వ్యతిరేకించిందో ఆయన ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని పదేపదే చెప్పడం ద్వారా క్యాడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.

‘దీదీ’ శిష్యరికంలో రాటుదేలి..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉన్న బంధం కేవలం కుటుంబపరమైనది మాత్రమే కాదు. టీఎంసీలో తిరుగులేని అగ్ర నాయకురాలిగా మమతా బెనర్జీ కొనసాగుతుండగా, ఆమె  మార్గదర్శకత్వంలో ఎదిగిన అభిషేక్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన వ్యూహకర్తగా, అప్రకటిత ‘నెంబర్ 2’గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువతను ఏకం చేస్తూ, ఆధునిక సాంకేతిక ప్రచార వ్యూహాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement