హర్ముజ్‌ బ్లాకేడ్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం! | Impact of Hormuz blockade on India | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌ బ్లాకేడ్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం!

Apr 14 2026 8:31 AM | Updated on Apr 14 2026 9:55 AM

Impact of Hormuz blockade on India

హర్ముజ్‌ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రిక్వెస్ట్‌లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్‌ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్‌ కనిపిస్తోంది.

గ్లోబల్‌ మార్కెట్‌లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్‌ బ్లాకేడ్‌ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌ గల్ఫ్‌ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు.  

పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్‌, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్‌ బ్లాకేడ్‌పై భారత్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

అదంతా ఉత్త ప్రచారమే!
భారత నౌకలకు హర్ముజ్‌ జలసంధి మార్గాన్ని ఇరాన్‌ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్‌ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్‌ రాయబారి మొహమ్మద్‌ ఫతాలి ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్‌ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్‌తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.

మొత్తంగా, హోర్ముజ్‌ బ్లాకేడ్‌ భారత్‌కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్‌ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement