‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్‌ వ్యవస్థకు సర్జరీ! | Nepal PM Balen Shahs 100 Point Blitz Sweeping Reforms | Sakshi
Sakshi News home page

‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్‌ వ్యవస్థకు సర్జరీ!

Apr 14 2026 8:15 AM | Updated on Apr 14 2026 8:38 AM

Nepal PM Balen Shahs 100 Point Blitz Sweeping Reforms

ఖాట్మాండు: ఒకవైపు స్వదేశంలో పరిపాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. మరోవైపు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలకు పదును పెడుతూ నేపాల్ ప్రధాని బాలేంద్ర ‘బాలెన్’ షా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. అత్యంత సాహసోపేతమైన ‘100 అంశాల ఎజెండా’ను ప్రకటించి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆయన, అదే సమయంలో భారత్‌లో తన తొలి అధికారిక పర్యటనకు సిద్ధమవుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

భారత్‌తో సరికొత్త బంధం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని బాలెన్ షా త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి అతిపెద్ద దౌత్యపరమైన అడుగు ఇదే కావడం గమనార్హం. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ పర్యటనకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాయి. వాణిజ్యం వృద్ధి, కనెక్టివిటీ పెంపు, ప్రాంతీయ సహకారం తదితర కీలక అంశాలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.

వీఐపీ కల్చర్‌కు బ్రేక్
దౌత్య సంబంధాలను బలపరుస్తూనే, స్వదేశంలో బాలెన్ షా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. నేపాల్ పరిపాలన, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ‘100 అంశాల ఎజెండా’ను ప్రకటించారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిని నిర్మూలించడం, సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిపాలనలో జాప్యాన్ని నివారించి, వేగం పెంచేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖల సంఖ్యను తగ్గించడంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ అనుబంధాలను నిషేధించేలా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు.

విద్యాసంస్థల్లో పాలిటిక్స్ బ్యాన్
విద్యాసంస్థల్లో రాజకీయాలను పారద్రోలేలా బాలెన్ సర్కార్  కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలను 90 రోజుల్లోగా పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానంలో స్వతంత్ర ప్రాతినిధ్యం కల్పించేలా ‘వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్’ కౌన్సిల్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇకపై బడులు, కాలేజీలు కేవలం అభ్యాస కేంద్రాలుగానే పనిచేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. వీటితో పాటు, నిరుపేదలకు ఉచిత వైద్యం, మహిళలకు రవాణా భద్రత, ఒత్తిడి లేని విద్యా వాతావరణం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం వంటి ప్రజా సంక్షేమ చర్యలను ఈ బ్లూప్రింట్‌లో ప్రధాన అంశాలుగా చేర్చారు.

ఇది కూడా చదవండి: బెంగాల్‌ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement