ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్ శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్ (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారు.
సంగీతమే శ్వాసగా..
1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్.. వృత్తిరీత్యా ఢిల్లీలోని కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ కార్యాలయం లోనూ కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అంకయ్య స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం ఆశించకుండా తన పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం.
అందుకున్న పురస్కారాలు..
శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. 1966-67 మధ్య కాలంలో శ్రీ త్యాగరాయ గాన సభ వ్యవస్థాపక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. యువ కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంగీత విద్వాంసులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.


