బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.
రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.
ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్(1997) చిత్రానికి సీక్వెల్ ఇది.


