నిర్మాత అర్జున రాజు కన్నుమూత | tollywood senior producer m arjuna raju passes away due to health issues | Sakshi
Sakshi News home page

నిర్మాత అర్జున రాజు కన్నుమూత

Mar 14 2026 1:35 AM | Updated on Mar 14 2026 1:35 AM

tollywood senior producer m arjuna raju passes away due to health issues

ప్రముఖ నిర్మాత ఎం. అర్జున రాజు కన్నుమూశారు. వయోభారం వల్ల శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం. రంగరాజు, సీతాయమ్మ దంపతుల కుమారుడు అర్జున రాజు. వెస్ట్‌ గోదావరి జిల్లా కోరుకొల్లు ఆయన స్వస్థలం. రోజా ఆర్ట్స్‌ అధినేతల్లో ఒకరైన శివ రామరాజు భాగస్వామ్యంతో ఎన్టీఆర్‌తో ‘వేటగాడు’ (1979), ‘కొండవీటి సింహం’ (1981) వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు అర్జున రాజు. రోజా ఆర్ట్‌ ప్రోడక్షన్స్ , రోజా ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్ల మీద కూడా పలు సినిమాలు తీశారాయన.

అలాగే కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా రూ పొందిన ‘అడవి సింహాలు’, శోభన్ బాబు హీరోగా నటించిన ‘కోడెత్రాచు’ చిత్రాలకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. చిరంజీవి హీరోగా ‘జేబుదొంగ’, నాగార్జున హీరోగా ‘బావ నచ్చాడు’, కృష్ణంరాజు, శ్రీకాంత్‌లతో ‘మా నాన్నకు పెళ్ళి’ వంటి సినిమాలను అర్జున రాజు నిర్మించారు. అలానే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘జాబిలి’, ‘అల్లరి’ నరేశ్‌తో ‘మా అల్లుడు వెరీగుడ్‌’ మూవీస్‌ నిర్మించారు.

జగపతిబాబు హీరోగా నటించిన ‘జగపతి’ (2005) చిత్రం తర్వాత అర్జున రాజు సినిమాలు నిర్మించలేదు. హిందీలో ‘నిషానా, జానీ దోస్త్, ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌’ వంటి ఆరు చిత్రాలు నిర్మించారు. ఆయనకి భార్య సీతాదేవి, కుమారుడు రామలింగ రాజు, కుమార్తె కుమారి ఉన్నారు. నేడు హైదరాబాద్‌లో అర్జున రాజు అంత్యక్రియలు జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement