కర్ణాటక వర్సెస్ కేరళ
సాక్షి బెంగళూరు: ప్రస్తుతం బెంగళూరులో కోగిలు ఘటన కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ఈ ఘటనను ఖండిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ట్వీట్ చేయడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు కేరళ సీఎం స్పందనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటకలో బుల్డోజర్ విధానం అమలవుతోందని పినరై ఆరోపించారు. ఈ కోగిలు క్రాస్ ఘటనలో ప్రస్తుతం కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయంగా పెనుదుమారం రేగుతోంది. అంతేకాకుండా పినరై సూచనల మేరకు సీపీఐ (ఎం) ఎంపీ ఏఏ రహీం, ఎల్‌డీఎఫ్ కూటమి ఎమ్మెల్యే కేటీ జలీల్ ఫకీర్ లేఔట్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడి వారికి న్యాయం చేయిస్తామని హామీనిచ్చారు. అయితే కర్ణాటక ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు.
180 ఇళ్లు కూల్చివేత..
బెంగళూరు యలహంక సమీపంలోని కోగిలు లేఔట్ ఫకీర్ కాలనీలో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార సంస్థ అధికారులు సుమారు 180 ఇళ్లను జేసీబీల సాయంతో నేలకూల్చారు. దీంతో సుమారు 2,500 మందికి పైగా ప్రజలు నివాసాలు కోల్పోయి వీధి పాలయ్యారు. కోగిలు గ్రామ సర్వే నంబర్– 99 ప్రభుత్వానికి చెందిన స్థలంలో 25 ఏళ్లుగా జీవిస్తున్న పేదవారు ప్రస్తుతం నిర్వాసితులై పోయారు. సుమారు 14 ఎకరాల 36 గుంటల విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంలో 180 ఇళ్లను అక్రమంగా నిర్మించుకుని నివాసం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.
సీపీఎం ఎంట్రీకి కారణం ఏంటి?
బెంగళూరు కోగిలు క్రాస్ ఫకీర్ లేఔట్‌లో జరిగిన ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం, సీపీఎం పార్టీ ఎందుకంత ఆసక్తి చూపుతున్నాయనే ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. కోగిలు క్రాస్‌లో ఇల్లు కోల్పోయిన వారిలో చాలా మంది ముస్లింలు, దళితులు ఉన్నారు. కేరళలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళ ఎన్నికల్లో సీపీఎం పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. అంతేకాకుండా కేరళలో కొన్ని ముస్లిం సంఘాలను అడ్డుపెట్టుకుని వారి ఓటు బ్యాంకు కోసం సీపీఎం పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. కేరళలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు, ప్రభుత్వ తీర్మానాలు రాజకీయంగా ముస్లింలను కమ్యూనిస్టు పార్టీకి దూరం చేసేలా ఉన్నట్లు తెలిసింది.
ముస్లిం ఓటు బ్యాంకు కోసమే..
ఇందుకు కౌంటర్‌గా ముస్లింలకు తాము అండగా ఉంటామని చెప్పుకునేందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ముస్లిం సముదాయం ఎక్కువగా ఉన్న కోగిలు ఫకీర్ లేఔట్‌లో బుల్డోజర్ ప్రయోగాన్ని సీపీఎం ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని భావించినట్లు తెలిసింది. అంతేకాకుండా కోగిలు ఫకీర్ లేఔట్‌లో అక్రమంగా నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్న వారిలో చాలా మంది కేరళ నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ కేరళ రాష్ట్ర వాసుల కోసం, ముస్లింల కోసం ముఖ్యమంత్రి పినరై అండగా ఉంటారని తెలిసేలా ఈ ఘటనలో భాగం అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం సిద్ధు కేరళ టూర్
కోగిలు క్రాస్ ఘటన తీవ్రతరం అవ్వడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. కొన్నేళ్లుగా కోగిలు లేఔట్ ఫకీర్ కాలనీ, వసీం లేఔట్‌లో ముస్లింలు అనధికారికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. ఈ స్థలం నివాసయోగ్యం కాదని, ఈ ప్రభుత్వ స్థలం ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఉద్ధేశించినదని తెలిపారు. గతంలో కూడా ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చామని, అయినా స్థలాన్ని ఖాళీ చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఇల్లు కోల్పోయిన వారికి రాజీవ్‌గాంధీ వసతి యోజన కింద ఒక స్థలాన్ని గుర్తించి ఇల్లు నిర్మించి ఇస్తామని, ఆ దిశగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం సిద్ధరామయ్య సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోగిలు క్రాస్ ఘటన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేరళకు వెళుతున్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో సీఎం సిద్ధరామయ్య కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానం మేరకు కేరళలోని శివగిరిలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 93వ శివగిరి తీర్థోద్బవ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని నారాయణ ధర్మ సంఘం నిర్వహిస్తోంది.
వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు
వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సీఎం టూర్ ఆసక్తిని కలిగిస్తోంది. ఇదే డిసెంబర్ 3న మంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్ ఒకే వేదికను పంచుకున్నారు. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కలుసుకున్నారు. అనంతరం ముచ్చటగా మూడో సారి కేరళలో భేటీ కానున్నారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీని కేరళలో అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కేసీ వేణుగోపాల్‌కు అహింద ఓటు బ్యాంకు ఎంతో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే అహింద ఓటును తమ వైపునకు తిప్పుకునేందుకు సీఎం సిద్ధరామయ్యను కేరళకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరోవైపు అసలే కోగిలు క్రాస్ ఘటన నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని కేరళ సీఎం పినరై విజయన్ ప్రయత్నించడంతో వచ్చే ఎన్నికల్లో ఇది సమస్య కాకూడదనే నేపథ్యంలో దీన్ని త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే సీఎం సిద్ధరామయ్యకు కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలిసింది. కాగా కర్ణాటక ప్రభుత్వ వ్యవహారాల్లో కేసీ వేణుగోపాల్ జోక్యం ఎక్కువవుతోందని ఇక్కడి విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
కోగిలు అక్రమ నివాసాల
కూల్చివేతలపై ప్రచ్ఛన్న యుద్ధం
కూల్చివేతలను తప్పు పట్టిన
కేరళ సీఎం పినరై విజయన్
తమ చర్యను సమర్థించుకున్న
కర్ణాటక సర్కార్


