రక్తమోడిన రహదారులు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. మంగళవారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాలను విషాదం కమ్మేసింది.
సిమెంటు లారీ బోల్తాపడి చిన్నారి...
బెళగావి జిల్లా రాయభాగ తాలూకా హలశిరగూరు గ్రామం వద్ద చిన్నారులు స్కూల్‌కు కాలి నడకన వెళ్తుండగా కుడచి నుంచి హారోగేరి వైపు వెళ్తున్న సిమెంటు లారీ మలుపులో అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. అమిత్ కాంబళె(11) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా అంజలి కాంబళె(15), అవినాశ్ కాంబళె(14) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి కార్యాచరణ జరిపి క్రేన్ సాయంతో లారీని పైకి తీశారు.
లారీ చక్రాల కింద చిక్కుకుని ఇద్దరు...
ధారవాడ శివారులోని జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధారవాడ పట్టణ నివాసులైన కిషన్(30), కిరణ్(32) అనే వ్యక్తులు మృతి చెందారు. వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా యరికొప్ప గ్రామం వద్ద లారీ ఢీకొంది. దీంతో ఇద్దరూ లారీ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు. ధారవాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చెట్టును ఢీకొన్న బస్సు–చిన్నారి మృతి
శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకా హులికల్ ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న చిన్నారి మృతి చెందింది. మంగళవారం తె ల్లవారుజామున దావణగెరె నుంచి మంగళూరు బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హులికల్ ఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఒకటిన్నర ఏడాది వయసున్న చిన్నారి మృతిచెందగా 10మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో శరీఫాబి, ఇమామ్ సాబ్, శబానాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం ధ్వంసమైంది.
మూడు వేర్వేరు ప్రమాదాల్లో
నలుగురు మృతి
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
రక్తమోడిన రహదారులు


