రూ.2 వేలు జమ
యశవంతపుర: గ్యారంటీ పథకంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసే గృహలక్ష్మి యోజన కింద ప్రతినెల మహిళలకు అందించే రూ.2వేల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. కొంతకాలంగా మహిళలకు నిధులు జమ కావడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 24వ కంతు రూ.2వేలను మహిళల ఖాతాలకు జమ చేశారు.
పీజీలో పేలుడు.. టెక్కీ మృతి
బనశంకరి: పీజీ వంటగదిలో సిలిండర్ పేలి టెక్కీ మృతిచెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కుందలహళ్లి కాలనీ బ్రూక్‌ఫీల్డ్ రోడ్డులో సెవెన్‌హిల్స్ శ్రీసాయి పీజీ ఉంది. ఇక్కడ 52 మంది నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి వంటగదిలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. దీంతో పీజీలో ఉన్న యువకులు బయటకు పరుగులు తీశారు.పేలుడుధాటికి పీజీ కట్టడం గోడలు బీటలుబారాయి. ప్రమాదంలో బళ్లారికి చెందిన అరవింద్(23) అనే టెక్కీ మృతి చెందగా వెంకటేశ్, విశాల్‌వర్మ, సీవీ.గోయల్ అనేవారు గాయపడ్డారు. హెచ్‌ఏఎల్ పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు అరవింద్ క్యాప్‌జెమినీలో సీనియర్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు.
ఎమ్మెల్యే వీరేంద్ర పప్పికి బెయిల్
బనశంకరి: అక్రమనగదు బదిలీ కేసులో జైలుపాలైన చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రపప్పికి బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమనగదు బదిలీకేసులో వీరేంద్రపప్పిని ఈడీ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 23న సిక్కింలో అరెస్ట్‌చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మంగళవారం విచారణ జరిగింది. వాదప్రతివాదనలను ఆలకించిన కోర్టు ఎమ్మెల్యే వీరేంద్రపప్పికి బెయిల్ మంజూరు చేసింది.
లోకాయుక్తకు చిక్కిన పీపీ
దొడ్డబళ్లాపురం: రూ.25వేలు లంచం తీసుకుంటూ ప్రభుత్వ న్యాయవాది(పబ్లిక్ ప్రాసిక్యూటర్)లోకాయుక్తకు చిక్కిన సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. కలబుర్గి పట్టణంలోని రెండవ పీడీజే కోర్టులో ప్రభుత్వ పీపీగా రాజమహేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కందనులి గ్రామానికి చెందిన నవీన్ అనంతయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన కుల నింద కేసును రాజమహేంద్ర వాదిస్తున్నారు. కేసు గెలిచేలా వాదించడానికి రాజమహేంద్ర రూ.50 వేలు లంచం అడిగాడు. తొలుత రూ.20 వేలు ఇచ్చిన నవీన్.. ఆ తర్వాత లోకాయుక్తను ఆశ్రయించాడు. పథకం ప్రకారం నవీన్ రూ.25వేలు అందజేస్తుండగా లోకాయుక్త డీఎస్పీ శీలవంత ఆధ్వర్యంలో అధికారులు దాడి చేశారు. పీపీ రాజమహేంద్రను అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.
వేకువ జాము వరకు మెట్రో సంచారం
యశవంతపుర: కొత్త సంవత్సరంలో భాగంగా బెంగళూరు నగరంలో బీఎంఆర్‌సీఎల్, బీఎంటీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ బుధవారం అర్ధరాత్రి నుంచి జనవరి 1న తెల్లవారు జామున 3:10 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. సొరంగం, గ్రీన్ మార్గాల్లో రైలు సంచారాన్ని విస్తరించారు. బుధవారం రాత్రి సామాన్య ట్రిప్పులు ముగిసిన తరువాత ఈ సేవలను విస్తరించినట్లు బీఎంఆర్‌సీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వైట్‌ఫీల్డ్ నుంచి చల్లఘట్ట వరకు రాత్రి 1:45 గంటల వరకు, చల్లఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు రాత్రి 2 గంటల వరకు, ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు జనవరి 1న తెల్లవారు జామున 3:10 గంటల వరకు మెట్రో రైళ్ల సంచారం ఉంటుంది. బొమ్మసంద్ర నుంచి ఆర్‌వీ రోడ్డు వరకు రాత్రి 1:30 గంటల వరకు మాత్రమే మెట్రో సంచారం ఉంటుంది. గ్రీన్, సొరంగ మార్గంలో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు సంచరించనుంది. ఎంజీ రోడ్డు మార్గంలో భారీ జనసంచారం ఉండే అవకాశం ఉన్నందున బుధవారం రాత్రి 10 గంటలకు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్‌ను మూసివేయనున్నట్లు బీఎంఆర్‌సీఎల్ తెలిపింది.
రూ.2 వేలు జమ


