క్రైమ్: కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన బీజేపీ నాయకుడు జగన్నివాస్ రావ్ కొడుకు కృష్ణ జె.రావ్ ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి శిశువుకు జన్మనిచ్చి నెలలు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా జన్మనిచ్చిన శిశువుకు కృష్ణ జె.రావ్ తండ్రిగా తేలింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోడానికి కృష్ణ నిరాకరించారు. ఇదే విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు కల్లడ్క ప్రభాకర్ భట్‌తో పాటు అనేక మంది బీజేపీ నాయకులు రాజీ పంచాయతీ చేయగా అదీ విఫలమైంది. ఇక న్యాయ పోరాటమే మార్గమని బాధిత యువతి కుటుంబం నిర్ణయించింది.
న్యాయపోరాటానికే సిద్ధం
కోర్టు ద్వారా శిశువుకు తండ్రి, తనకు భర్త కావాలనే ఉద్దేశంతో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. కృష్ణ జె.రావ్‌కు యువతితో పాఠశాల విద్యార్థి దశ నుంచీ పరిచయం. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గర్భవతిని చేసిన యువతినే పెళ్లి చేసుకోవాలని అనేక మంది కృష్ణ కుటుంబంపై ఒత్తిడి చేశారు. మొదట నిరాకరించినా కొద్ది రోజుల తరువాత ఒత్తిడికి తలొగ్గి పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నారు. అయితే అతనికి 21 ఏళ్లు పూర్తి కాని కారణంగా, పూర్తికాగానే వివాహం చేస్తామని కృష్ణ తండ్రి జగన్నివాస రావ్ హామీనిచ్చారు.
చేతులెత్తేసిన కృష్ణ
శిశువు పుట్టగానే కృష్ణకు 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన తరువాత విషయం పోలీసు స్టేషన్‌కు చేరింది. కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన కృష్ణ ఆ శిశువుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. దీంతో కోర్టు జోక్యం చేసుకొని డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించింది. బాధిత యువతి, శిశువు, కృష్ణల రక్త నమూనాలను బెంగళూరు ప్రయోగాలయానికి తరలించి పరీక్షించగా కృష్ణే తండ్రి అని తేలింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బీజేపీ నుంచి జగన్నివాస్ రావ్‌ను బహిష్కరించింది.
పలు సార్లు రాజీ ప్రయత్నాలు
శిశువు డీఎన్‌ఏ పాజిటివ్‌గా వచ్చిన తరువాత కృష్ణ కుటుంబం వివాహం చేసుకోడానికి నిరాకరిస్తున్నట్లు యువతి కుటుంబం అరోపిస్తోంది. మూడు నెలల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు కల్లడ్క ప్రభాకర్ భట్, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, దక్షిణ కన్నడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సతీశ్ కుంపల, విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కేపీ నంజుండి నేతృత్వంలో పలు మార్లు రాజీ ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి.
కోర్టు తీర్పుకే కట్టుబడతాం
ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి. ఇక న్యాయ పోరాటం చేయటమే మేలని భావించాం. జైలుకెళ్లిన కృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చారు. శిశువుకు తండ్రి, తనకు భర్త దొరికితే చాలు. రాజీ ప్రయత్నాలు విఫలం కావటంతో కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు బాధిత యువతి చెబుతోంది. డబ్బు ఆశ చూపారు, న్యాయం దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటమే తమకు శరణ్యమని బాధిత యువతి కుటుంబం అంటోంది.


