కాలువ వెంట గాలిస్తున్న పోలీసులు
ఇద్దరు బిడ్డలకు అనారోగ్యం కావడంతో కలత చెందిన ఓ తల్లి
ఆస్పత్రికి బయలుదేరి.. ఆపై పిల్లలను కాలువలోకి తోసి తానూ దూకిన వైనం
నంద్యాల జిల్లా గడివేముల మండలంలో విషాదం
గడివేముల: ఇద్దరు బిడ్డలు.. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు బిడ్డలను అనారోగ్యం వెంటాడింది. దీంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. చిన్నారులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అని చెప్పి.. మధ్యలోనే దిగి ఇద్దరు బిడ్డలను కాలువలో తోసి తానూ దూకేసిన∙విషాద ఘటన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగానిపల్లె ఎల్లా లక్ష్మి (23)ని అదే గ్రామానికి చెందిన రమణయ్య నాలుగేళ్ల్ల కిందట వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (2), సంగీత (మూడునెలలు) ఉన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా రక్తకణాలు తగ్గిపోయాయని, గడివేములకు వెళ్లాలని సూచించాడు. దీంతో లక్ష్మి తన బిడ్డలను తీసుకుని గడివేముల బయలుదేరింది. మార్గమధ్యలోని మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్‌బీసీ ప్రధాన కాలువ వద్ద ఇద్దరు చిన్నారులతో దిగడంతో అటుగా వెళ్తున్న స్థానిక రైతులు ‘ఏమ్మా..ఇక్కడ కూర్చున్నావ్’ అని అడిగారు.
ఆ వెంటనే లక్ష్మీ ఇద్దరు కుమార్తెలను కాలువలో పడేసి తానూ దూకింది. రక్షించేందుకు స్థానికులు యత్నించగా.. ‘నేను చావడానికే వచ్చాను.. మమ్మల్ని ఎవరూ కాపాడవద్దు’ అని కేకలు వేసింది. స్థానిక ఎస్‌ఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి, సిబ్బందితో కలిసి ఎస్సార్‌బీసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు.


